సుప్రీంకోర్టుకు హాజరుకాని జస్టిస్ కర్ణన్
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఆయన మాత్రం సోమవారం నాటి విచారణకు హాజరుకాలేదు. జస్టిస్ కర్ణన్ పై సుమోటోగా ధిక్కార కేసు స్వీకరించి విచారణ ఎందుకు చేపట్టకూడదో ఆయన వ్యక్తిగతంగా తెలపాలని ఫిబ్రవరి 8న సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలను విమర్శిస్తూ జస్టిస్ కర్ణన్ రాసిన వరుస లేఖలపై సుప్రీం కోర్టు సీరియస్ అయి ధిక్కార కేసు నమోదు చేయడానికి సిద్ధపడింది.
ఆయనకు జ్యుడీషియల్, కార్యనిర్వాహక విధులు అప్పగించవద్దని హైకోర్టును ఆదేశించింది. అయితే ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనం.. జస్టిస్ కర్ణన్ విచారణకు హాజరుకానందున ఆయనపై ధిక్కార అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టా లన్న అటార్నీ జనరల్ రోహత్గీ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆయన సమాధానం కోసం మూడు వారాల గడువిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.