అప్పటి వరకు అమ్మ నగలు అక్కడే..
బెంగళూరు: జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. చెన్నైలో పాటు హైదరాబాద్లో జయలలితకు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇళ్లు, తోటలు ఉన్నాయి. ఈ విషయం అటుంచితే జయలలితకు చెంది బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు జయలలితపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 1996లో చెన్నైలోని జయలలిత నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10 వేల చీరలు, 91 వాచీలు, 44 ఎయిర్ కండీషనర్లు, 750 జతల చెప్పులు ఉన్నాయి. ఈ వస్తువుల విలువ 6 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పట్లో ఈ వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాయి.
జయలలితపై నమోదైన కేసును కర్ణాటకలో విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కింది కోర్టు జయలలితను దోషిగా తీర్పు చెప్పగా, బెంగళూరు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. హైకోర్టులో విముక్తి లభించడంతో మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు జయలలిత నగలు కర్ణాటక ట్రెజరీలోనే ఉంటాయి.