karri satish
-
ఓవర్ టు చెన్నై
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగ కర్రి సతీష్‌ను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఇతడితో పాటు ప్రధాన అనుచరుడైన నరేంద్రనూ ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నై తరలించారు. హైదరాబాద్ సహా మొత్తం మూడు రాష్ట్రాల్లో 56 చోరీలు చేసిన ఈ ఘరానా దొంగలను సిటీ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని చేసిన ఏడు దొంగతనాల్లో ఈ ముఠా రూ.1.05 కోట్ల సొత్తు ఎత్తుకుపోయింది. ఓ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. ‘సతీష్ అండ్ కో’ చెన్నైలోని నాలుగు చోట్ల దొంగతనాలు చేసినట్లు తేలింది. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ 13 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతడిపై సిటీ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్ సహా మరొకరితో కలిసి ముఠా కట్టాడు. ఈ ఏడాది మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ గ్యాంగ్ వరుసపెట్టి చోరీలు చేసింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ఏపీల్లోనూ పంజా విసిరింది. గూగుల్ మ్యాప్‌లో ‘గుర్తుపెట్టుకుని’... సతీష్, నరేంద్ర ఖరీదైన ప్రాంతాలు, ప్రముఖులనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయారు. జూన్‌లో తమిళనాడుకు వెళ్లిన వీరు లాడ్జిలో మకాం వేశారు. స్థానికంగా అద్దెకు తీసుకున్న బైక్‌పై పగటిపూట సంచరిస్తూ అక్కడి అనువైన ప్రాంతాల్లో తాళం వేసున్న ఇళ్లను గుర్తించారు. రాత్రి చోరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంటిని మర్చిపోకుండా ఉండేందుకు దాని లోకేషన్‌ను గూగుల్ మ్యాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరి సెల్‌కు షేర్ చేసుకునే వారు. దీని సాయంతో రాత్రి వేళ మళ్లీ ఇంటి వద్దకు వెళ్లి తమ ‘పని’ పూర్తి చేసుకునే వారు. ఈ పంథాలో మొత్తం నాలుగు చోరీలు చేశారు. చెన్నై, నుంగంబాకం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే డాక్టర్ కౌసిఖ్ ఇంట్లో పంజా విసిరి 146.6 గ్రాముల ప్లాటినం నగలు ఎత్తుకుపోయింది. ఆ తర్వాత తైనంపేట్, ముంబాలమ్, మైలాపూర్ల్లోనూ మూడు ఇళ్లల్లో దొంగతనాలు చేసింది. చెన్నైలో చోరీ చేసిన ప్లాటినం నగలను అమ్మడానికి హైదరాబాద్‌తో పాటు కడప, పొద్దుటూరుల్లోనూ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివ రకు ముంబైలో అమ్ముదామనే ప్రయత్నాల్లో అక్కడకు పట్టుకుని వెళ్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ బృందానికి సొత్తుతో సహా చిక్కేసింది. అప్పట్లో వీరి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1.05 కోట్ల విలువైన 1712 గ్రాముల బరువున్న ప్లాటినం, బంగారం, వజ్రా లు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పోలీసులకు సమాచారం... సతీష్, నరేంద్రల విచారణ నేపథ్యంలోనే వారిపై ఉన్న కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నారని తేలింది. దీంతో వెంటనే సిటీ పోలీసులు ఆయా అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వీరిద్దరినీ పీటీ వారెంట్‌పై అక్కడకు తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు కేసుల్లోనూ అరెస్టుల పరంపర పూర్తి చేసి సోమవారం నాటికి తిరిగి హైదరాబాద్ తీసుకురావాలని భావిస్తోంది. కేవలం సీసీ కెమెరాలు లేని ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసే ఈ గ్యాంగ్ నేరం స్థలంలో తమ వేలిముద్రలు సైతం దొరక్కుండా గ్లౌజులు ధరిస్తుంది. డాక్టర్ కౌశిఖ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సతీష్ ముఠా బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లోనూ చోరీ చేసింది. అక్కడి సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులూ ఈ గ్యాంగ్‌ను పీటీ వారెంట్లపై తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
దొంగను భార్య ముద్దుగా ‘బుజ్జి’ అని పిలుస్తుంది..
సాక్షి, సిటీబ్యూరో: అతడో కరుడు గట్టిన దొంగ. సంపన్నుల ఇళ్లే టార్గెట్‌గా చోరీలు చేస్తున్న ఇతగాడు పోలీసులకు దొరికినప్పుడల్లా తన పేరు ఒక్కోలా చెబుతుంటాడు. అలా ఇప్పటిదాకా ‘సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్’గా రికార్డులకెక్కాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా ‘బుజ్జి’ అని పిలుస్తుంది. ఈ బుజ్జి అసలు పేరు మాత్రం ‘కర్రి సతీష్’. వరుస చోరీలు చేస్తున్న కర్రి సతీష్ అలియాస్ సత్తిబాబును మంగళవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, అతడి నుంచి రూ.1.05 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2014లోనే ఆర్థికంగా ‘సెటిలై’నపోయిన ఇతగాడు.. వైజాగ్ పోలీసుల కారణంగానే మళ్లీ ‘పని’ ప్రారంభించాల్సి వచ్చింది. సూర్యాపేట అధికారులు అరెస్టు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. రెండు నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడానికి కారణం తనతో వచ్చిన ‘విజిటర్’ నిర్వాకమేనన్నాడు. ఏపీలోని విశాఖపట్నంలోని కొత్త గాజువాక నుంచి వచ్చి రాచకొండ పరిధిలోని మీర్‌పేటలో స్థిరపడ్డ ఈ చోరుడి వెనుక ఓ ఆసక్తికరమైన ‘సెటిల్మెంట్ కథ’ కూడా ఉంది. చోరీల్లో పట్టుబడి.. సింగపూర్ చెక్కేసి.. విశాఖకు చెందిన కారుడ్రైవర్ అయిన సత్తిబాబు 2005లో వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ సత్తిబాబుకు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ వచ్చేసింది. దీని ఆధారంగా 2010లో సింగపూర్ వెళ్లిపోయిన అతగాడు ఏడాది పాటు వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం అలవాటైన సతీష్ తిరిగి వైజాగ్ వచ్చేసి 2012 వరకు 16 చోరీలు చేశాడు. అర్ధరాత్రి వేళ అపార్ట్మెంట్స్ గోడలు ఎగబాకి ఫ్లాట్స్‌లోకి ప్రవేశించి చోరీలు చేశాడు. ఈ ఆరోపణలపై 2012 జనవరిలో విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి రెండు కేజీల బంగారం, కేజీన్నర వెండి, వజ్రాలు, డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. లంచం సొమ్ము బ్యాంకులో డిపాజిట్ ఈ కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు వైజాగ్ వదిలేయాని భావించాడు. హైదరాబాద్‌కు వచ్చి చందానగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో 12 నేరాలు చేశాడు. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్బీలో ఇల్లు కొనుక్కున్న ఇతగాడు ఓ కారు, మరో ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. అయితే ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని 2014లో వెతుక్కుంటూ వచ్చిన విశాఖ పోలీసులకు చిక్కాడు. అయితే అప్పట్లో కొందరు అధికారులకు భారీ స్థాయిలో లంచాలు ఇచ్చి, అరెస్టు కాకుండా సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ లంచాల డబ్బుకోసం ఇల్లుతో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును సత్తిబాబు పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా వేశాడు. ఆర్థికంగా దెబ్బతిన్న సతీష మళ్లీ నేరాల బాటపట్టి 2014లోనే సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీయగా ‘వైజాగ్ సెటిల్మెంట్’ అంశం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో వరుస చోరీలు సతీష్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో చోరీలకు పాల్పడి బెంగళూరు పారిపోయాడు. సెప్టెంబర్ 9న ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం దొంగిలించి పార్కింగ్‌లో ఉన్న కారుతో ఉడాయించాడు. అనంతరం కారుకు బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదేనెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఈ సందర్భంలో కడపకు చెందిన మరో దొంగ సత్తిబాబు వెంట ఉన్నాడు. అతడిని వద్దని చెప్పినా సంపన్నుల ఇళ్లల్లో చోరీ ఎలా చేస్తారో చూస్తానంటూ వెంట వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఆదికేశవులు నాయుడు సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంట వచ్చినవాడితో కలిసి సత్తిబాబు పారిపోయాడు. అయితే, అనుభవం లేని ‘విజిటర్’ పోలీసులకు చిక్కడంతో సత్తిబాబూ ఆగిపోవాల్సి వచ్చింది. అరెస్టై జైలుకెళ్లిన అతడు విడుదలై వచ్చి మళ్లీ వరుసపెట్టి నేరాలు చేశాడు. చోరీ సమయంలో సత్తిబాబు తన కవళికలు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్‌లు ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. -
ఇచ్చింది కేజీ... లెక్కకట్టింది అరకేజీ!
‘దొంగ’ బంగారానికి తప్పడు లెక్కలు గజదొంగకు టోకరా వేసిన రిసీవర్లు సతీష్ అరెస్ట్‌తో నిశ్చేష్ట్టులైన వైజాగ్‌వాసులు బంజారాహిల్స్: వైజాగ్‌కు చెందిన కర్రి సతీష్ ఇళ్లకు కన్నం వేయడంలో మహాదిట్ట. దొంగతనం చేయాలని ఒక్కసారి అనుకున్నాడంటే చాలు.. పోలీసులకు తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ‘పని’ కానిచ్చేస్తాడు. ఇలాంటి పేరుమోసిన దొంగను కొంత మంది రిసీవర్లు మోసం చేశారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్ సినార్వ్యాలీతో ఇటీవల జరిగిన చోరీతో పాటు మరో 13 దొంగతనం కేసుల్లో, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు, సూర్యాపేటలో ఇంకో రెండు దొంగతనం కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న కర్రి సతీష్‌ను ఎట్టకేలకు చిన్న ఆధారంతో సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సతీష్ చేసిన దొంగతనాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చోరీ సొత్తును వైజాగ్‌లో తనకు బాగా నమ్మకస్తులైన రిసీవర్లకు ఇచ్చి వారు ఇచ్చిన డబ్బును తీసుకునేవాడు. ఇక్కడే చాలా మంది రిసీవర్లు సతీష్‌ను మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శర్మ ఇంట్లో చోరీ చేసిన కిలో బంగారు నగలను సతీష్ వైజాగ్‌కు చెందిన రిసీవర్‌కు ఇవ్వగా... అతను అరకిలోగా నమ్మించి ఆ మొత్తానికే డబ్బులు ఇచ్చాడు. ఆ బంగారాన్ని రిసీవర్ కరిగించినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సొత్తు రికవరీ చేసే పనిలో భాగంగా రిసీవర్‌తో పాటు సతీష్‌ను మంగళవారం ఉద యం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వైజాగ్‌కు తీసుకెళ్లారు. ప్రతి దొంగతనం కేసులోను సతీష్‌ను అక్కడి రిసీవర్లు భారీగా మోసగించినట్లు వెల్లడైంది. ఇంకోవైపు చోరీ సొత్తుతో వచ్చిన డబ్బును ఈ గజదొంగ వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి.. అక్కడ పేరు మోసిన రియల్టర్‌గా వెలుగొందడం విశేషం. పత్రికల్లో సతీష్ గురించి వార్తలు రావడంతో వైజాగ్‌వాసులు నిశ్చేష్టులయ్యారు. ఇదిలా ఉండగా... రియల్టర్ శర్మ ఇంట్లో దొంగతనం చేసిన రోజు రాత్రి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించిన నిందితుడు వాటికంటికి చిక్కకుండా గోడ చాటున నక్కుతూ ఇంట్లోకి దూరినట్లుగా తేలింది. అందుకే సీసీ ఫుటేజీల్లో ఎక్కడా అతడు కనిపించలేదు. ఏప్రిల్ 28న శర్మ నివాసంలో దొంగతనం చేసిన అనంతరం సతీష్ సూర్యాపేటకు వెళ్లినట్లుగా విచారణలో తేలింది. దర్యాప్తులో మరిన్ని దొంగతనం కేసులు వెలుగులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.