ఇచ్చింది కేజీ... లెక్కకట్టింది అరకేజీ!
- ‘దొంగ’ బంగారానికి తప్పడు లెక్కలు
- గజదొంగకు టోకరా వేసిన రిసీవర్లు
- సతీష్ అరెస్ట్‌తో నిశ్చేష్ట్టులైన వైజాగ్‌వాసులు
బంజారాహిల్స్: వైజాగ్‌కు చెందిన కర్రి సతీష్ ఇళ్లకు కన్నం వేయడంలో మహాదిట్ట. దొంగతనం చేయాలని ఒక్కసారి అనుకున్నాడంటే చాలు.. పోలీసులకు తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ‘పని’ కానిచ్చేస్తాడు. ఇలాంటి పేరుమోసిన దొంగను కొంత మంది రిసీవర్లు మోసం చేశారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్ సినార్‌వ్యాలీతో ఇటీవల జరిగిన చోరీతో పాటు మరో 13 దొంగతనం కేసుల్లో, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు, సూర్యాపేటలో ఇంకో రెండు దొంగతనం కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న కర్రి సతీష్‌ను ఎట్టకేలకు చిన్న ఆధారంతో సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో సతీష్ చేసిన దొంగతనాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చోరీ సొత్తును వైజాగ్‌లో తనకు బాగా నమ్మకస్తులైన రిసీవర్లకు ఇచ్చి వారు ఇచ్చిన డబ్బును తీసుకునేవాడు. ఇక్కడే చాలా మంది రిసీవర్లు సతీష్‌ను మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శర్మ ఇంట్లో చోరీ చేసిన కిలో బంగారు నగలను సతీష్ వైజాగ్‌కు చెందిన రిసీవర్‌కు ఇవ్వగా... అతను అరకిలోగా నమ్మించి ఆ మొత్తానికే డబ్బులు ఇచ్చాడు. ఆ బంగారాన్ని రిసీవర్ కరిగించినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సొత్తు రికవరీ చేసే పనిలో భాగంగా రిసీవర్‌తో పాటు సతీష్‌ను మంగళవారం ఉద యం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వైజాగ్‌కు తీసుకెళ్లారు. ప్రతి దొంగతనం కేసులోను సతీష్‌ను అక్కడి రిసీవర్లు భారీగా మోసగించినట్లు వెల్లడైంది.
ఇంకోవైపు చోరీ సొత్తుతో వచ్చిన డబ్బును ఈ గజదొంగ వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి.. అక్కడ పేరు మోసిన రియల్టర్‌గా వెలుగొందడం విశేషం. పత్రికల్లో సతీష్ గురించి వార్తలు రావడంతో వైజాగ్‌వాసులు నిశ్చేష్టులయ్యారు. ఇదిలా ఉండగా... రియల్టర్ శర్మ ఇంట్లో దొంగతనం చేసిన రోజు రాత్రి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించిన నిందితుడు వాటికంటికి చిక్కకుండా గోడ చాటున నక్కుతూ ఇంట్లోకి దూరినట్లుగా తేలింది. అందుకే సీసీ ఫుటేజీల్లో ఎక్కడా అతడు కనిపించలేదు. ఏప్రిల్ 28న శర్మ నివాసంలో దొంగతనం చేసిన అనంతరం సతీష్ సూర్యాపేటకు వెళ్లినట్లుగా విచారణలో తేలింది. దర్యాప్తులో మరిన్ని దొంగతనం కేసులు వెలుగులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.