west zone task force police
-
ఎక్కడ సీజ్ చేశారో చెప్పరా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేసిన రూ.5 కోట్లను.. తామే సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తప్పుడు పంచనామా రూపొందించి ప్రకటించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తమ ఆధీనంలో నగదు ఉంచుకునేందుకే తప్పుడు పంచనామా రూపొందించారని మండిపడింది. డబ్బులు ఎక్కడ సీజ్ చేశారనేది పంచనామాలో పేర్కొనకపోవడం ఏంటని ప్రశ్నించింది. నగదు సీజ్ చేసిన సమయంలో సాక్షులుగా పేర్కొన్న వారు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడం అనుమానాస్పదంగా ఉందన్నది.. సీజ్ చేసిన డబ్బు తమ సంస్థకు చెందినదని మెక్‌టెక్ సంస్థ అన్ని ఆధారాలు చూపిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బు ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉంచుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. సీజ్ చేసిన డబ్బు ఎవరిదన్నది తేలిన నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉన్న రూ.5 కోట్లను 2019 ఆగస్టు 28 నుంచి 12 శాతం వడ్డీతో కలిపి మెక్‌టెక్ సంస్థకు 4 వారాల్లో చెల్లించాలని, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు అసలు జరిగిందేమిటంటే.. 2019 ఆగస్టు 23న టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.5 కోట్లు పట్టుబడింది. డబ్బుతోపాటు దొరికిన విపుల్‌కుమార్, మరికొందరు వ్యక్తులను 27న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అయితే 28న ఆ నగదును తామే విపుల్‌కుమార్ నుంచి సీజ్ చేసినట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక తప్పుడు పంచనామా సృష్టించారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు విపుల్‌కుమార్ నుంచి నగదు సీజ్ చేసే సమయంలో ఇద్దరు సాక్షులున్నారని పేర్కొన్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన వారు. అయితే పంచనామాలో నగదు ఏ ప్రదేశం నుంచి సీజ్ చేశారనే దగ్గర ఖాళీగా ఉంచారు. ‘పి.ఉమేశ్‌చంద్ర అండ్ సన్స్ సంస్థలో విపుల్ కుమార్ పటేల్ ఉద్యోగి అని, రూ.5 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో తాము సీజ్ చేశామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. అయితే సీజ్ చేసిన డబ్బును ఉమేశ్‌చంద్ర అండ్ సన్స్ సంస్థ కోరడం లేదు. వ్యాపార అవసరాల కోసం నగదు తీసుకెళ్తున్న సమయంలో సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆదాయ వివరాలు చూపినా డబ్బు మెక్‌టెక్ సంస్థకు తిరిగి ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం’అన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. -
ఇచ్చింది కేజీ... లెక్కకట్టింది అరకేజీ!
‘దొంగ’ బంగారానికి తప్పడు లెక్కలు గజదొంగకు టోకరా వేసిన రిసీవర్లు సతీష్ అరెస్ట్‌తో నిశ్చేష్ట్టులైన వైజాగ్‌వాసులు బంజారాహిల్స్: వైజాగ్‌కు చెందిన కర్రి సతీష్ ఇళ్లకు కన్నం వేయడంలో మహాదిట్ట. దొంగతనం చేయాలని ఒక్కసారి అనుకున్నాడంటే చాలు.. పోలీసులకు తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ‘పని’ కానిచ్చేస్తాడు. ఇలాంటి పేరుమోసిన దొంగను కొంత మంది రిసీవర్లు మోసం చేశారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్ సినార్వ్యాలీతో ఇటీవల జరిగిన చోరీతో పాటు మరో 13 దొంగతనం కేసుల్లో, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు, సూర్యాపేటలో ఇంకో రెండు దొంగతనం కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న కర్రి సతీష్‌ను ఎట్టకేలకు చిన్న ఆధారంతో సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సతీష్ చేసిన దొంగతనాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చోరీ సొత్తును వైజాగ్‌లో తనకు బాగా నమ్మకస్తులైన రిసీవర్లకు ఇచ్చి వారు ఇచ్చిన డబ్బును తీసుకునేవాడు. ఇక్కడే చాలా మంది రిసీవర్లు సతీష్‌ను మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శర్మ ఇంట్లో చోరీ చేసిన కిలో బంగారు నగలను సతీష్ వైజాగ్‌కు చెందిన రిసీవర్‌కు ఇవ్వగా... అతను అరకిలోగా నమ్మించి ఆ మొత్తానికే డబ్బులు ఇచ్చాడు. ఆ బంగారాన్ని రిసీవర్ కరిగించినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సొత్తు రికవరీ చేసే పనిలో భాగంగా రిసీవర్‌తో పాటు సతీష్‌ను మంగళవారం ఉద యం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వైజాగ్‌కు తీసుకెళ్లారు. ప్రతి దొంగతనం కేసులోను సతీష్‌ను అక్కడి రిసీవర్లు భారీగా మోసగించినట్లు వెల్లడైంది. ఇంకోవైపు చోరీ సొత్తుతో వచ్చిన డబ్బును ఈ గజదొంగ వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి.. అక్కడ పేరు మోసిన రియల్టర్‌గా వెలుగొందడం విశేషం. పత్రికల్లో సతీష్ గురించి వార్తలు రావడంతో వైజాగ్‌వాసులు నిశ్చేష్టులయ్యారు. ఇదిలా ఉండగా... రియల్టర్ శర్మ ఇంట్లో దొంగతనం చేసిన రోజు రాత్రి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించిన నిందితుడు వాటికంటికి చిక్కకుండా గోడ చాటున నక్కుతూ ఇంట్లోకి దూరినట్లుగా తేలింది. అందుకే సీసీ ఫుటేజీల్లో ఎక్కడా అతడు కనిపించలేదు. ఏప్రిల్ 28న శర్మ నివాసంలో దొంగతనం చేసిన అనంతరం సతీష్ సూర్యాపేటకు వెళ్లినట్లుగా విచారణలో తేలింది. దర్యాప్తులో మరిన్ని దొంగతనం కేసులు వెలుగులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.