సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేసిన రూ.5 కోట్లను.. తామే సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తప్పుడు పంచనామా రూపొందించి ప్రకటించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తమ ఆధీనంలో నగదు ఉంచుకునేందుకే తప్పుడు పంచనామా రూపొందించారని మండిపడింది. డబ్బులు ఎక్కడ సీజ్ చేశారనేది పంచనామాలో పేర్కొనకపోవడం ఏంటని ప్రశ్నించింది. నగదు సీజ్ చేసిన సమయంలో సాక్షులుగా పేర్కొన్న వారు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడం అనుమానాస్పదంగా ఉందన్నది.. సీజ్ చేసిన డబ్బు తమ సంస్థకు చెందినదని మెక్‌టెక్ సంస్థ అన్ని ఆధారాలు చూపిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బు ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉంచుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. సీజ్ చేసిన డబ్బు ఎవరిదన్నది తేలిన నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉన్న రూ.5 కోట్లను 2019 ఆగస్టు 28 నుంచి 12 శాతం వడ్డీతో కలిపి మెక్‌టెక్ సంస్థకు 4 వారాల్లో చెల్లించాలని, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు
అసలు జరిగిందేమిటంటే..
2019 ఆగస్టు 23న టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.5 కోట్లు పట్టుబడింది. డబ్బుతోపాటు దొరికిన విపుల్‌కుమార్, మరికొందరు వ్యక్తులను 27న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అయితే 28న ఆ నగదును తామే విపుల్‌కుమార్ నుంచి సీజ్ చేసినట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక తప్పుడు పంచనామా సృష్టించారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు విపుల్‌కుమార్ నుంచి నగదు సీజ్ చేసే సమయంలో ఇద్దరు సాక్షులున్నారని పేర్కొన్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు పాతబస్తీలోని డబీర్‌పురాకు చెందిన వారు. అయితే పంచనామాలో నగదు ఏ ప్రదేశం నుంచి సీజ్ చేశారనే దగ్గర ఖాళీగా ఉంచారు. ‘పి.ఉమేశ్‌చంద్ర అండ్ సన్స్ సంస్థలో విపుల్ కుమార్ పటేల్ ఉద్యోగి అని, రూ.5 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో తాము సీజ్ చేశామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. అయితే సీజ్ చేసిన డబ్బును ఉమేశ్‌చంద్ర అండ్ సన్స్ సంస్థ కోరడం లేదు. వ్యాపార అవసరాల కోసం నగదు తీసుకెళ్తున్న సమయంలో సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆదాయ వివరాలు చూపినా డబ్బు మెక్‌టెక్ సంస్థకు తిరిగి ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం’అన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
Comments
Please login to add a commentAdd a comment