సొత్తును చూపుతున్న సీపీ అంజనీకుమార్ (ఇన్‌సెట్) నిందితుడు సతీష్
సాక్షి, సిటీబ్యూరో: అతడో కరుడు గట్టిన దొంగ. సంపన్నుల ఇళ్లే టార్గెట్‌గా చోరీలు చేస్తున్న ఇతగాడు పోలీసులకు దొరికినప్పుడల్లా తన పేరు ఒక్కోలా చెబుతుంటాడు. అలా ఇప్పటిదాకా ‘సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్’గా రికార్డులకెక్కాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా ‘బుజ్జి’ అని పిలుస్తుంది. ఈ బుజ్జి అసలు పేరు మాత్రం ‘కర్రి సతీష్’. వరుస చోరీలు చేస్తున్న కర్రి సతీష్ అలియాస్ సత్తిబాబును మంగళవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, అతడి నుంచి రూ.1.05 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2014లోనే ఆర్థికంగా ‘సెటిలై’నపోయిన ఇతగాడు.. వైజాగ్ పోలీసుల కారణంగానే మళ్లీ ‘పని’ ప్రారంభించాల్సి వచ్చింది. సూర్యాపేట అధికారులు అరెస్టు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. రెండు నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడానికి కారణం తనతో వచ్చిన ‘విజిటర్’ నిర్వాకమేనన్నాడు. ఏపీలోని విశాఖపట్నంలోని కొత్త గాజువాక నుంచి వచ్చి రాచకొండ పరిధిలోని మీర్‌పేటలో స్థిరపడ్డ ఈ చోరుడి వెనుక ఓ ఆసక్తికరమైన ‘సెటిల్‌మెంట్ కథ’ కూడా ఉంది.
చోరీల్లో పట్టుబడి.. సింగపూర్ చెక్కేసి..
విశాఖకు చెందిన కారుడ్రైవర్ అయిన సత్తిబాబు 2005లో వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ సత్తిబాబుకు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ వచ్చేసింది. దీని ఆధారంగా 2010లో సింగపూర్ వెళ్లిపోయిన అతగాడు ఏడాది పాటు వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం అలవాటైన సతీష్ తిరిగి వైజాగ్ వచ్చేసి 2012 వరకు 16 చోరీలు చేశాడు. అర్ధరాత్రి వేళ అపార్ట్‌మెంట్స్ గోడలు ఎగబాకి ఫ్లాట్స్‌లోకి ప్రవేశించి చోరీలు చేశాడు. ఈ ఆరోపణలపై 2012 జనవరిలో విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి రెండు కేజీల బంగారం, కేజీన్నర వెండి, వజ్రాలు, డాలర్లు స్వాధీనం చేసుకున్నారు.
లంచం సొమ్ము బ్యాంకులో డిపాజిట్
ఈ కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు వైజాగ్ వదిలేయాని భావించాడు. హైదరాబాద్‌కు వచ్చి చందానగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 నేరాలు చేశాడు. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీలో ఇల్లు కొనుక్కున్న ఇతగాడు ఓ కారు, మరో ప్రొక్‌లైనర్ కొని సెటిలైపోయాడు. అయితే ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని 2014లో వెతుక్కుంటూ వచ్చిన విశాఖ పోలీసులకు చిక్కాడు. అయితే అప్పట్లో కొందరు అధికారులకు భారీ స్థాయిలో లంచాలు ఇచ్చి, అరెస్టు కాకుండా సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ లంచాల డబ్బుకోసం ఇల్లుతో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును సత్తిబాబు పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా వేశాడు. ఆర్థికంగా దెబ్బతిన్న సతీష మళ్లీ నేరాల బాటపట్టి 2014లోనే సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీయగా ‘వైజాగ్ సెటిల్‌మెంట్’ అంశం వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో వరుస చోరీలు
సతీష్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లో చోరీలకు పాల్పడి బెంగళూరు పారిపోయాడు. సెప్టెంబర్ 9న ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం దొంగిలించి పార్కింగ్‌లో ఉన్న కారుతో ఉడాయించాడు. అనంతరం కారుకు బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదేనెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఈ సందర్భంలో కడపకు చెందిన మరో దొంగ సత్తిబాబు వెంట ఉన్నాడు. అతడిని వద్దని చెప్పినా సంపన్నుల ఇళ్లల్లో చోరీ ఎలా చేస్తారో చూస్తానంటూ వెంట వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఆదికేశవులు నాయుడు సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంట వచ్చినవాడితో కలిసి సత్తిబాబు పారిపోయాడు. అయితే, అనుభవం లేని ‘విజిటర్’ పోలీసులకు చిక్కడంతో సత్తిబాబూ ఆగిపోవాల్సి వచ్చింది. అరెస్టై జైలుకెళ్లిన అతడు విడుదలై వచ్చి మళ్లీ వరుసపెట్టి నేరాలు చేశాడు. చోరీ సమయంలో సత్తిబాబు తన కవళికలు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్‌లు ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment