పర్యాటక శాఖ కార్తీకమాసం టూర్ ప్యాకేజీలు
సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ పలు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వెళ్లి వచ్చేలా ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి వెళ్లే శాతవాహన రీజియన్ టూర్ టికెట్ ధర పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800గా పేర్కొంది. కాకతీయ రీజియన్ టూర్లో కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, రామప్ప, యాదగిరిగుట్ట, కీసరగుట్ట పర్యటనకు పెద్దలకు రూ.1,350, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించింది.
ఇక పంచారామం టూర్లో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పర్యటనకుగాను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.2,160... హైదరాబాద్-అనంతగిరి పర్యటన పెద్దలకు రూ.699, పిల్లలకు రూ.560గా తెలిపింది. హైదరాబాద్-కీసరగుట్ట-శామీర్పేట టూర్కుగాను పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 29 వరకు ఈ ప్యాకేజీ టూర్లు అందుబాటులో ఉంటాయని.. బషీర్బాగ్లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి నిర్దేశిత సమయాల్లో ప్రారంభమవుతాయని పేర్కొంది.