ప్రజలకు చేరువయ్యేందుకే కంట్రోల్ రూమ్‌లు: ఎస్పీ
కొత్తవలస, న్యూస్‌లైన్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ కార్తికేయ అన్నారు. కొత్తవలస జంక్షన్లో ఏర్పాటు చేసిన పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సబ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ పోలీసులు ఉంటూ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలిలో ఇటువంటి కంట్రోల్ రూమ్‌లు ప్రారంభించామని చెప్పారు. జిల్లాలో నేరాల అదుపునకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు కొత్తవలస పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎస్పీ కృష్ణప్రసన్న ఉన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ జి.మహేంద్ర, వైస్‌చైర్మన్ ఎంవీఎస్ గిరిబాబు తదితరులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐ మురళి, ఎస్ఐ బి.రమణయ్య పాల్గొన్నారు.