karuppan
-
అందుకే మదురై అమ్మాయినయ్యా!
తమిళసినిమా: ఆ రెండు చిత్రాల్లో రాని గుర్తింపు కరుప్పన్ చిత్రం తెచ్చి పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది నటి తాన్యా. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన ఈ యువ నటి శశికుమార్‌కు జంటగా భలే వెళ్లైదేవా చిత్రం ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఈ బ్యూటీని చాలా నిరాశపరచింది. ఆ తరువాత అరుళ్‌నిధి సరసన నటించిన బృందావనం చిత్రం ఈమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా తాజాగా మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా కరుప్పన్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కరుప్పన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న తాన్యా మాట్లాడుతూ ఇది మదురై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్రామీణ కథా చిత్రం అని చెప్పింది. ఇందులో తాను అన్భుసెల్వి అనే పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం మదురై అమ్మాయిగా మారి నటిస్తున్నానని చెప్పింది. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్నప్పుడే తనకు సక్సెస్ ఖాయం అని భావించానని చెప్పింది. ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, అలాంటిది ఈ కరుప్పన్ చిత్రంలో పాత్ర పూర్తిగా మదురై స్లాంగ్‌లో మాట్లాడడంతో చెన్నై నగరంలో పుట్టి పెరిగిన తాను ఆ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోవడంతో డబ్బింగ్ కళాకారిణితో చెప్పిస్తున్నారని తెలిపింది. రెండు చిత్రాల్లో రాని పేరు కరుప్పన్ చిత్రంతో తెచ్చుకుంటాననే నమ్మకం తనకు ఉందని అంది. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ పట్టికలో చేరిపోతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. -
గ్రామీణ నేపథ్యంగా కరుప్పన్
తమిళసినిమా: చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలిసిన నిర్మాత ఏఎం.రత్నం అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యానించారు. ఏన్నో సంచలన హిట్ చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం తాజాగా శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కరుప్పన్. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా నటి తాన్య నటించారు. బాబీసింహ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రేణుగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వమ్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ రేణుగుంట చిత్రంలోని వేశ్య పాత్రను కూడా ఎంతో ఉన్నతంగా చూపించిన దర్శకుడు పన్నీర్‌సెల్వం అని అన్నారు. ఈ పాత్రను కొంచెం కూడా అశ్లీలంగా చూపించలేదని, అలాగే ఇందులోని ఒక పాటను చాలా చక్కగా తెరకెక్కించారని చెప్పారు. ఇక ఈ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం గురించి చెప్పాలంటే ఒక చిత్రానికి ఎలా ప్రచారం చేయాలో అనే యుక్తి తెలిసిన నిర్మాత ఆయనని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రెగ్యులర్ ప్రతికథానాయకుడు అవసరం లేకపోయిందన్నారు. ఒక హీరోనే విలన్‌గా నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న తరువాత నటుడు బాబీసింహాకు ఈ చిత్రం గురించి తాను చెప్పానన్నారు.ఆయన తనకు మంచి మిత్రుడు కావడంతో ఏమీ మాట్లాడకుండా ఇందులో విలన్‌గా నటించడానికి అంగీకరించారని తెలిపారు.కరుప్పన్ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశం చోటు చేసుకుంటుందని, అయితే తాను ఎద్దును ముట్టుకోనుకూడా లేదని, ఆ సన్నివేశాలను రియల్ బుల్‌ఫైట్ క్రీడా వీరుల సన్నివేశాలతో ఫైట్ మాస్టర్ రాజశేఖర్ చాలా అద్భుతంగా మ్యాచ్ చేశారని విజయ్‌సేతుపతి తెలిపారు. విజయ్‌సేతుపతి గురించి ముందే చెప్పా ఈ చిత్ర ప్రారంభానికి ముందే విజయ్‌సేతుపతిని కలిసి మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పానని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలై మంచి విజయాలను సాధించాయన్నారు. ఇక కరుప్పన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రం కాదన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సహజత్వంతో కూడిన చిత్రంగా ఉంటుందని అన్నారు. ఇందులో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకున్నా నటి తాన్య పాత్రకు నప్పడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. హీరో విజయ్‌సేతుపతితో పాటు అందరూ చాలా బాగా నటించారని చెప్పారు. చిత్ర క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాత ఏఎం.రత్నం తెలిపారు. -
విజయ్ సేతుపతితో మరోసారి
నటి లక్ష్మి మీనన్ కు మరో అవకాశం వచ్చింది. రెక్క చిత్రం తరువాత మరో చిత్రానికి సంతకం చేయని ఈ కేరళ కుట్టికి తాజాగా లక్కీ ఛాన్సే లభించిందని చెప్పాలి. రెక్క చిత్రం హీరోతో రెండోసారి రొమాన్స్ చేసే అవకాశం వరించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి కాల్షీట్స్ డైరీ మూడేళ్ల వరకూ ఫుల్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఆయన నటించిన కవన్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ప్రముఖ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో పని చేస్తున్నారు. ఇంతకు ముందు రేణిగుంట, 18 వయసు తదితర చిత్రాలను తెరకెక్కించిన పన్నీర్‌సెల్వం ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి కరుప్పన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది మదురై, తేని ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న కథా చిత్రం అని తెలిసింది. ప్రస్తుతం బర్నింగ్ అంశంగా మారిన జల్లికట్టు ఇతివృత్తంగా ఈ కరుప్పన్ చిత్రం ఉంటుందని సమాచారం. విజయ్‌సేతుపతి ఇందులో జల్లికట్టు వీరుడిగా నటిస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా బాక్సింగ్ నటి రితికాసింగ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మధురై యువతిగా రితికాసింగ్ రూపం సరిగా సెట్ కాదని భావించడంతో ఆమె చిత్రం నుంచి వైదొలగినట్లు, ఆ అవకాశం ఇప్పుడు నటి లక్ష్మిమీనన్ ను వరించినట్లు తెలిసింది. ఈ అమ్మడు ఇప్పటికే కొంబన్, సుందరపాండియన్, కుట్టిపులి చిత్రాలలో మదురై అమ్మాయిగా దుమ్మురేపారన్నది గమనార్హం. కరుప్పన్ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముమ్మరంగా జరుపుకుంటోందట. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాంజీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.