అందుకే మదురై అమ్మాయినయ్యా!
తమిళసినిమా: ఆ రెండు చిత్రాల్లో రాని గుర్తింపు కరుప్పన్ చిత్రం తెచ్చి పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది నటి తాన్యా. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన ఈ యువ నటి శశికుమార్‌కు జంటగా భలే వెళ్‌లైదేవా చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఈ బ్యూటీని చాలా నిరాశపరచింది. ఆ తరువాత అరుళ్‌నిధి సరసన నటించిన బృందావనం చిత్రం ఈమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.
అయినా తాజాగా మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా కరుప్పన్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కరుప్పన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న తాన్యా మాట్లాడుతూ ఇది మదురై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్రామీణ కథా చిత్రం అని చెప్పింది. ఇందులో తాను అన్భుసెల్వి అనే పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం మదురై అమ్మాయిగా మారి నటిస్తున్నానని చెప్పింది.
ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్నప్పుడే తనకు సక్సెస్ ఖాయం అని భావించానని చెప్పింది. ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, అలాంటిది ఈ కరుప్పన్ చిత్రంలో పాత్ర పూర్తిగా మదురై స్లాంగ్‌లో మాట్లాడడంతో చెన్నై నగరంలో పుట్టి పెరిగిన తాను ఆ యాసలో పర్ఫెక్ట్‌గా మాట్లాడలేకపోవడంతో డబ్బింగ్ కళాకారిణితో చెప్పిస్తున్నారని తెలిపింది. రెండు చిత్రాల్లో రాని పేరు కరుప్పన్ చిత్రంతో తెచ్చుకుంటాననే నమ్మకం తనకు ఉందని అంది. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ పట్టికలో చేరిపోతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.