ఆ నమ్మకాన్ని వమ్ముకానీయను: సయేషా
చెన్నై: తెరంగేట్రం చేసిన టాలీవుడ్ మూవీ ‘అఖిల్’, బాలీవుడ్లో మొదటి సినిమా 'శివాయ్'లు ఆశించినమేర ఆడకపోవడంతో యువహీరోయిన్ సయేషా సైగల్ కెరీర్ డోలాయమానంలో పడినట్లైంది. అయితే, అంతటితో నిరుత్సాహపడక, తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే రెండు భారీ క్రేజీ సినిమాలకు సైన్ చేసింది.
బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన అమ్మాయినే అయినా తమిళ సినిమా అంటే విపరీతమైన ఇష్టమని చెప్పుకొచ్చింది సయేషా. వాస్తవానికి మొదటి సినిమా తమిళంలోనే నటించాలని అనుకున్నా, ఆ అవకాశం రాకపోవడంతో టాలీవుడ్లో ‘అఖిల్’తో చేసినట్లు వివరించింది.
ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌లు హీరోలుగా రూపొందుతున్న ‘కరుప్పు రాజా- వెళ్లై రాజా’ సినిమాలో సయేషా హీరోయిన్గా చేస్తోంది. అంతకుముందే ‘వనమగన్’లో జయం రవితో జోడీకట్టింది. ఇటీవల ‘కరుప్ప..’ షూటింగ్ గ్యాప్‌లో సయేషా మీడియాతో చిట్‌చాట్ చేసింది.
బాలీవుడ్ ప్రముఖ కుటుంబానికి చెందిన మీరు నటిగా దక్షిణాదిని ఎంచుకోవడానికి కారణం?
నేను సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయినైనా సినిమాలు నన్ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదు. పూర్తి ఇష్టంతోనే నటించడానికి వచ్చాను. దక్షిణాది ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను తొలుత తమిళ చిత్రంలోనే నటించాలని ఆశపడ్డా. కానీ అవకాశం రాలేదు. దీంతో అఖిల్‌తో చేయాల్సివచ్చింది. ఆ సినిమా చూసి దర్శకుడు విజయ్ కోలీవుడ్‌లో అవకాశం కల్పించారు. అలా నాకెంతో ఇష్టమైన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.
తమిళంలో మీ తొలి హీరో జయం రవి గురించి?
నాకు తమిళం రాదు. అయితే షూటింగ్ స్పాట్లో జయం రవి, దర్శకుడు విజయ్ చాలా సహకరించారు. ప్రతి కొత్త హీరోయిన్‌కు జయం రవితో నటించే అవకాశం వస్తే అది వరమే అవుతుంది.
‘వనమగన్’ చిత్రంలో డ్యాన్స్‌లో దుమ్మురేపారట?
నాకు నటనకంటే నాట్యంపైనే మోహం ఎక్కువ. శాస్త్రీయ నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యం దాకా అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా టైమ్ దొరికిదే డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూఉంటా. ఒక వేళ నేను నటిని కాకుండా ఉండుంటే ఖచ్చితంగా నాట్యకళాకారిణిని అయ్యేదాన్ని.
ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం గురించి?
తమిళంలో నా ఫస్ట్ మూవీ ‘వనమగన్’లో ఒక పాటలో ప్రభుదేవా నాతో అద్భుతంగా డ్యాన్స్ చేయించారు. ఒక డ్యాన్సర్‌గా నేను ఆయనకు వీరాభిమానిని. ప్రభుదేవా నటించిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అలాంటాయన నన్ను హీరోయిన్గా పెట్టి విశాల్, కార్తీ లాంటి పెద్ద హీరోలతో సినిమా తీస్తుండటం నావరకైతే గ్రేట్. ప్రభుదేవా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయను.
మిమ్మల్ని నటి హన్సికతో పోల్చడం గురించి?
ఇదే విషయాన్ని చాలామంది నాతో అన్నారు. అయితే నన్ను ఎవరితోనూ పోల్చరాదన్నది నా భావన. నేను నేనుగానే ఉండాలనుకుంటున్నాను. ఇక సినిమాలో ఎవరూ ఎవరి స్థానాన్ని చేజిక్కించుకోలేరు. ఎవరి స్థానం వారికుంటుంది. నాకంటూ ఒక స్థానాన్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా అందిస్తారన్న నమ్మకం ఉంది.
(చదవండి: షోలే మాదిరి చేస్తానన్నారు)