పాపం పోలీసులని తెలియక..
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దొంగల యత్నం
సాక్షి, ముంబై: అహమ్మదాబాద్ నేషనల్ హైవే సమీపంలో ఉన్న కాసా ప్రాంతం సమీపంలో మఫ్టీలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా పోలీసులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి....కాసా ప్రాంతంలో అధికంగా దారిదోపిడీలు జరుగుతుండటంతో దొంగలను పట్టుకోవడానికి కాసా ప్రాంత పోలీసులు పథకం పన్నారు. ఈ మేరకు మఫ్టీలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అద్దె వాహనం తీసుకుని సాధారణ ప్రయాణికులుగా ఆ ప్రాంతంలో ప్రయాణించారు. అనంతరం దారిలో వాహనం రిపేర్ వచ్చినట్లు ఆపి దొంగల కోసం ఎదురుచూడసాగారు.
వారు ఊహించినట్లుగానే కొంతసేపటికి ఐదుగురు వ్యక్తులు వచ్చి వారిని ప్రశ్నించారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు ముగ్గురూ మహిళలే ఉండటంతో బెదిరించి దోపిడీ చేసేందుకు యత్నించారు. అంతవరకు సాధారణ మహిళలుగా నటించింది కానిస్టేబుళ్లుగా గుర్తించిన దొంగలు ఒక్కసారిగా ఖంగుతిని పారిపోయేందుకు యత్నించారు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారిపై కారం పొడి చల్లారు. అయితే దొంగల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు. మిగిలిన ముగ్గురూ సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారని, త్వరలోనే వారినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.