వైభవంగా జ్యోతి ఆరాధనోత్సవాలు
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో తొలిసారిగా నిర్వహిస్తున్న కాశిరెడ్డి నాయన 21వ ఆరాధన ఉత్సవాలకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆశ్రమ నిర్వాహకులు పదిరోజులుగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. కాశిరెడ్డినాయనకు పీతిపాత్రమైన జొన్న రొట్టెలను బండిఆత్మకూరు మండలంలో పాటు వెలుగోడు, నందాయలతో పాటు ప్రకాశం జిల్లా నుంచి కూడా భక్తులు తయారు చేసి తీసుకొచ్చారు. రాత్రి 12గంటల సమయంలో ఆశ్రమంలో ఉన్న గాయత్రి దేవి వద్ద, కూర్మగిరి క్షేత్రంలోను జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే జ్ఞాన జ్యోతిని చూసి తరించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సోమవారం ఉదయం నుంచే తరలి వచ్చారు. సాయంత్రం సమయంలో భక్తులరద్దీ మరింత పెరిగింది.