అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్‌తో చర్చల్లేవు: పాక్
పాకిస్థాన్ మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. తమ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేది లేదంటూ.. కాశ్మీర్ అంశాన్నిఅజెండాలో చేర్చకపోతే భారతదేశంతో చర్చల ప్రసక్తి లేనే లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జాతీయభద్రత, విదేశీ వ్యవహారాలలో పాక్ ప్రధానమంత్రి సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరి మధ్య భేటీ జరగడం మంచిదేనని, ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే అందులో దృష్టిపెట్టారని అజీజ్ చెప్పారు. ముంబై ఉగ్రదాడి కేసులో లష్కరే తాయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విచారణ గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భారతదేశం నుంచి ఈ విషయంలో తమకు మరిన్ని ఆధారాలు కావాలన్నారు. మోదీతో సమావేశం సందర్భంగా.. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల విషయంలో కూడా తమకు మరింత సమాచారం కావాలని నవాజ్ షరీఫ్ అడిగినట్లు ఆయన చెప్పారు.