ముకుంద్ వరదరాజన్‌కు అశోకచక్ర అవార్డు
టీనగర్: ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు చెన్నై తాంబరానికి చెందిన సైనిక మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్‌కుమార్ పేర్లను ప్రకటించారు. గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీ కాశ్మీర్ సోపియాన్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు తీవ్రవాదులు చొరబడి దాడులు జరిపారు. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఇక్కడ జరిగిన దాడిలో మేజర్ ముకుంద్ వరదరాజన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆయన ఇద్దరిని హతమార్చి తను ప్రాణత్యాగం చేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ గత ఏడాది ఆగస్టు 24వ తేదీన కాశ్మీర్ గుబ్వారా జిల్లాలో తీవ్రవాదుల తుపాకీ కాల్పుల్లో మృతిచెందారు. సోమవారం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కాకు రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ అశోకచక్ర అవార్డు అందజేశారు. అదేవిధంగా నాయక్ నీరజ్‌కుమార్ భార్య అశోక చక్ర అవార్డును అందుకున్నారు.
ఆరుగురు తమిళులకు పద్మ అవార్డులు
తమిళనాడుకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధారఘునాథన్, మాజీ భారత ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాల సామితో సహా ఆరుగురిని పద్మ అవార్డులు వరించాయి. అనేక రంగాలలో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ అవార్డులను అందజేసి గౌరవిస్తోంది. ఈ ఏడాదికి పద్మ అవార్డులకు 104 మంది ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్‌కు పద్మ విభూషణ్ అవార్డు, ఎన్ గోపాలసామి, సుధా రఘునాథన్ పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యూరు. ఎ.కన్యాకుమారి, పివి రాజారామన్, దివంగత ఆర్.వాసుదేవన్‌కు పద్మశ్రీ అవార్డులు అందజేశారు.