ఆడ దెయ్యం కోసం శ్మశానంలో వేట
నిర్మల్ : ఊళ్లోని పురుషులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఊర్లో ఆడ దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. భయంతో కాశీగూడ గ్రామంలోని 100 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో కాశీగూడ గ్రామం ఉంది.
ఆడ దెయ్యం మగాళ్లను చంపుతోందనే మూఢనమ్మకాన్ని పొగొట్టేందుకు గ్రామంలోని శ్మశానవాటికలో 'దెయ్యంతో సెల్ఫీకి ప్రయత్నం' అనే కార్యక్రమానికి హేతువాద బృందం శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఈ తంతు మొత్తాన్ని సోషల్‌మీడియాలో లైవ్‌గా చూపించింది బృందం. ఈ హేతువాద బృందానికి ఫేస్బుక్లో ఓ గ్రూప్ కూడా ఉంది. అందులోని సభ్యలు అందరూ కలిసే 'దెయ్యంతో సెల్ఫీకి ప్రయత్నం' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రముఖ హేతువాది బాబు గోగినేని, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, మరికొందరు హేతువాదులు కాశీగూడకు వెళ్లారు. శనివారం రాత్రి శ్మశానం, దెయ్యం తిరుగుతోందని గ్రామస్థులు చెబుతున్న ప్రదేశాల్లో కలియతిరిగారు. దెయ్యంతో సెల్ఫీ' కార్యక్రమంపై బాబు గోగినేని మాట్లాడుతూ ''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అన్నారు.