Kasturbagandhi girls college
-
వికటించిన ఐరన్ మాత్రలు
ధర్పల్లి : ఐరన్ మాత్రలు వికటించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు సుశీల, నాగమణి సూచించినట్లుగానే భోజనం చేసిన తర్వాతే విద్యార్థినులు మాత్రలు వేసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. 22 మంది అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ధర్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. స్టాఫ్ నర్సులు ఉమ, హప్రీన్లు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించారు. హెచ్ఈఓ కిషన్‌రావు, ఏఎన్ఎంలు గంగామణి, నాగమణితో పాటు ఎంఎల్ఓ లింగమయ్య విద్యార్థులను పరామర్శించారు. డాక్టర్లే లేరు ధర్పల్లి ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ ఉండాలి. అయితే ఐరన్ మాత్రలతో అస్వస్థతకు గురి అయిన వారిని ఆస్పత్రికి తరలించినప్పుడు డాక్టర్ ఒక్కరు కూడా లేక పోవటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు వెంటనే మెడికల్ ఆఫీసర్ స్వాతికి సమాచారం అందించారు. ఆమె జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మాత్రల్లో లోపం లేదని, భోజనం చేయకుండా మాత్రలు వేసుకున్నందునే అస్వస్థతకు గురై ఉంటారని వైద్యురాలు తెలిపారు. ఎలాంటి ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు. -
నత్తనడకన ‘కేజీబీవీ’ నిర్మాణం!
చేవెళ్ల, న్యూస్‌లైన్ : బాలికల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రారంభించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎప్పుడో పూర్తి కావాల్సిన భవన నిర్మాణం ఇంకా సాగుతుండడంతో ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థినులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగైదు సంవత్సరాలుగా అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు ఈ విద్యాసంవత్సరం కూడా నూతన భవనంలోకి మారే యోగం కనిపించడంలేదు. చేవెళ్ల మండల కేంద్రoలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం నిర్మాణానికి మూడు సంవత్సరాల క్రితం రూ.కోటి 25 లక్షల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణానికి నిధులు మంజూరైన తరువాత రెండు సంవత్సరాలకు అంటే గత సంవత్సరం ఆరంభంలో ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా ఈ విద్యాసంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రెండేళ్లుగా శ్రీసత్యసాయి కాలనీలోని ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న కేజీబీవీలో వసతులు లేక పిల్లలు సతమతమవుతున్నారు. ఇక్కడ పాఠశాలలో దాదాపు 114 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 20 మంది విద్యార్థినులు పదోతరగతి పూర్తి చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాల్సి ఉండగా అసౌకర్యాలతో ఇబ్బందులు తప్పడంలేదు. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, స్నానపుగదులు సరిపడా లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపన చేసి రెండేళ్లు... కేజీబీవీ నూతన భవన నిర్మాణానికి మొదట్లో స్థల సమస్య ఏర్పడింది. ఎక్కడా స్థలం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో స్థలాన్ని కేటాయించారు. ఇది గుంతలు, గుంతలుగా ఉండటంతో కాంట్రాక్టు దక్కించుకున్న గుత్తేదారు పనులు చేపట్టేందుకు మొదట్లో నిరాసక్తత చూపించాడు. ఈ క్రమంలోనే 2012 ఏప్రిల్ 22న మాజీ హోంమంత్రి సబితారెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో కాంట్రాక్టరు 2013 జనవరిలో పనులు ప్రారం భించాడు. ప్రస్తుతం రెండు అంతస్తులు స్లాబ్ వే శారు. గదుల్లో ఫ్లోరింగ్ పూర్తి చేస్తే కొన్ని గదులు పాఠశాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పనులు పూర్తి కావాలంటే మరికొన్ని నెలలుపట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి రావా లంటే మరో ఏడాది పట్టవచ్చని చెబుతున్నారు. కాగా కొన్ని గదులనైనా సిద్ధం చేసి పాఠశాలకు అప్పగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండటం కాంట్రాక్టరుకు అలుసుగా మారిందని, దీంతో భవన నిర్మాణం నత్తనడకన సాగుతోందని పేర్కొంటున్నారు.