Kasturirangan
-
కస్తూరిరంగన్‌కు తుది వీడ్కోలు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు. -
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత
బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.