మా‘నీరు’ దోపిడీకి కుట్ర
కరీంనగర్ అర్బన్ : మధ్యమానేరు నీటిని దోపిడీ చేసేందుకే సీఎం కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కుట్రపూరితంగా ప్రాజెక్టును నింపారని డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కొదురుపాక, రుద్రవరం, చీర్లవంచ, నీలోజిపల్లి గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మిషన్‌భగీరథ పేరిట సిద్దిపేట, మల్లన్నసాగర్‌కు నీటిని తీసుకెళ్లేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు తూంలు లేవని తెలిసి కూడా ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోపై అంచనా లేకుండా ప్రాజెక్టును నింపేందుకు ఎలా సాహసించారని ఆయన ప్రశ్నించారు. దీంతో నాలుగు గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులంతా రోడ్లపైకి వచ్చారన్నారు. వెంటనే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2.35 లక్షలు చెల్లించాలని, రూ.50 వేల రవాణా చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.