kathputli
-
గళం విప్పిన కళాకారులు
న్యూఢిల్లీ:అభివృద్ధి పేరుతో కళను చంపుతున్నారంటూ కట్పుత్లీ కాలనీలోని కళాకారులు ఆదివారం తమదైన శైలిలో ఆందోళనకు దిగారు. మురికివాడను అభివృద్ధి చేస్తామంటూ చెప్పి రహేజా వంటి ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కుట్ర చేస్తున్నారంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిస్ బంజర్ జమీన్కో హమే చమన్ బనాయా... వహీ జమీన్ హమే దో’ (ఏ బంజరు భూమినైతే సుందరమైన వనంగా మార్చామో ఆ భూమినే మాకివ్వండి), సైమన్ గో బ్యాక్, డీడీఏ గో బ్యాక్ అంటూ నినదించారు. దాదాపు మూడువేల మంది కళాకారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మహిళా కాళాకారులు ఈ ఆందోళనలో ముందుండి పాటలు పాడుతూ నినాదాలు చేశారు. కట్పుత్లీని ఖాళీ చేసేదిలేదని స్పష్టం చేశారు. ఈ కాలనీని ముందు ఖాళీ చేయించి, ఆ తర్వాత ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, వాటిలో కొన్ని ఫ్లాట్లను స్థానికులకు కేటాయించాలని డీడీఏ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రహేజా కంపెనీకి అప్పగించింది. అప్పటివరకు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు స్థానికులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా డీడీఏ చేసింది. శుక్రవారం నుంచే స్థానికులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడం ప్రారంభించారు. నకిలీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఫ్లాట్లకు బదులుగా తమకు భూమినే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే భూమిమీద తాము హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లమంటే ఎలా వెళ్తామంటూ అధికారులను నిలదీశారు. డీడీఏ అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు వినలేదు. కాగా దాదాపు సగంమంది కాలనీవాసులు ఇక్కడి నుంచి తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నా మిగతా సగంమంది వల్లే సమస్య ఎదురవుతోందని డీడీఏ అధికారులు చె ప్పారు. ఒకట్రెండు రోజుల్లో వారితో మాట్లాడి, వారి అనుమానాలను నివృత్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ పాదర్శకంగానే వ్యవహరిస్తున్నామని, అయినప్పటికీ కొందరు అవగాహన లేకపోవడంతోనే సందేహిస్తున్నారని చెబుతున్నారు. ‘మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ ఇక్కడికి తీసుకొస్తామనే హామీ ఏ ఒక్క అధికారి నుంచి రావడంలేదు. ఇది మాకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల కోసం ఇలా సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టడం సరికాద’ని దిలీప్ అనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా తాము మాత్రం కాలనీ నుంచి అడుగు బయట పెట్ట బోమన్నారు. అధికారులు తమ ప్రయ త్నాల ను మానుకునేవరకు ఆందోళన చేస్తుం టామని, మరిం త తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
ఖాళీ అవుతున్న కట్పుత్లీ
న్యూఢిల్లీ: పునరావాసం కల్పిస్తామంటూ అధికారులు ఇచ్చిన హామీతో కట్పుత్లీ కాలనీవాసులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలుతున్నా రు. తమ కాలనీని ప్రైవేటు బిల్డర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ భీష్మించుకు కూర్చున్న విషయం తెలి సిందే. దీంతో అటువంటి అనుమానాలు అక్కరలేదని, పునరావాసం కల్పిస్తామంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) అధికారులు ఇచ్చిన హామీతో ఖాళీ చేసేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు శుక్రవారం ఉదయం నుంచి కొందరు కొందరుగా తరలివెళ్తున్నారు. ఎక్కడో దూరంగా తమకు తాత్కాలిక పునరావాసాన్ని కల్పిస్తే పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందన్న స్థానికుల వాదనను కూడా డీడీఏ అధికారులు పరిగణనలోకి తీసుకొని కాలనీకి సమీపంలోనేగల ఆనంద్ప్రభాత్లో తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి తరలి వెళ్లేందుకు కట్పుత్లీ కాలనీవాసులు అంగీకరించారు. పశ్చిమ ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతంలోగల కట్పుత్లీ కాలనీలో కళాకారులకు చెందిన 3,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. బొమ్మలను తయా రు చేసేకళాకారుల నుంచి బొమ్మలను ఆడించే కళాకారులు, జానపద కళాకారులు తదితర కుటుం బాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కాగా మురికివాడగా ఉన్న ఈ రంగుల ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలని భావించిన డీడీఏ రహేజా సంస్థతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో కళాకారుల కుటుంబాలకు కూడా ఫ్లాట్లను కేటాయించనున్నారు. కాగా ఎక్కడ తమకు ఫ్లాట్లు కేటాయించరేమోననే భయం తో ఈ కాలనీవాసులు ఖాళీ చేసేందుకు నిరాకరించారు. చివరకు అధికారులు హామీ ఇవ్వడంతో ఇక్కడి నుంచి తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలివెళ్తున్నారు. -
కథ్పుత్లీ కాలనీని ఖాళీ చెయ్యం
న్యూఢిల్లీ: దశబ్దాల కాలంగా నివసిస్తున్న క థ్పుత్లీ కాలనీని ఖాళీ చేసేదేలేదని స్థానిక బొమ్మల తయారీదారులు, జానపద కళాకారులు చెబుతున్నారు. ఈ కాలనీని ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తులకు ఈ కాలనీని కట్టబెట్టాలని చూస్తున్నారని, దశాబ్దాల కాలంగా ఇక్కడే ఉంటు, ఇక్కడే పుట్టిపెరిగిన తాము మరోచోటుకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు. 2009 ప్రణాళిక ప్రకారం ఈ కాలనీలోని కళాకారులను తాత్కాలికంగా మరోచోటుకు తరలించి, నాలుగేళ్లలో ఇక్కడ ఫ్లాట్లు సిద్ధం చేయాలనేది అధికారుల వ్యూహంగా కనిపిస్తోందని, ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నవారిని ఆనంద్ ప్రభాత్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలోకి తరలిస్తారని చెబుతున్నారని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమాధానమే లేదన్నారు. తాము ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నామని, ఇప్పుడు ఖాళీ చేసి, నాలుగు కిలోమీటర్ల దూరం తాత్కాలికంగా, ఆ తర్వాత మరెక్కడికో వెళ్తే వారి చదువులు సాగేదెలాగని స్థానిక వ్యక్తి దిలీప్ భట్ ప్రశ్నించారు. భూమి విషయంలో అధికారులు అబద్ధమాడుతున్నారు. బిల్డర్ల కోసం భూమి అందుబాటులో ఉందని మొదట చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు.