న్యూఢిల్లీ:అభివృద్ధి పేరుతో కళను చంపుతున్నారంటూ కట్‌పుత్లీ కాలనీలోని కళాకారులు ఆదివారం తమదైన శైలిలో ఆందోళనకు దిగారు. మురికివాడను అభివృద్ధి చేస్తామంటూ చెప్పి రహేజా వంటి ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కుట్ర చేస్తున్నారంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జిస్ బంజర్ జమీన్‌కో హమే చమన్ బనాయా... వహీ జమీన్ హమే దో’ (ఏ బంజరు భూమినైతే సుందరమైన వనంగా మార్చామో ఆ భూమినే మాకివ్వండి), సైమన్ గో బ్యాక్, డీడీఏ గో బ్యాక్ అంటూ నినదించారు. దాదాపు మూడువేల మంది కళాకారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మహిళా కాళాకారులు ఈ ఆందోళనలో ముందుండి పాటలు పాడుతూ నినాదాలు చేశారు. కట్‌పుత్లీని ఖాళీ చేసేదిలేదని స్పష్టం చేశారు. ఈ కాలనీని ముందు ఖాళీ చేయించి, ఆ తర్వాత ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, వాటిలో కొన్ని ఫ్లాట్లను స్థానికులకు కేటాయించాలని డీడీఏ ప్రతిపాదనలు రూపొందించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రహేజా కంపెనీకి అప్పగించింది. అప్పటివరకు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు స్థానికులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా డీడీఏ చేసింది. శుక్రవారం నుంచే స్థానికులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడం ప్రారంభించారు. నకిలీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఫ్లాట్లకు బదులుగా తమకు భూమినే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే భూమిమీద తాము హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లమంటే ఎలా వెళ్తామంటూ అధికారులను నిలదీశారు.
డీడీఏ అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు వినలేదు. కాగా దాదాపు సగంమంది కాలనీవాసులు ఇక్కడి నుంచి తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నా మిగతా సగంమంది వల్లే సమస్య ఎదురవుతోందని డీడీఏ అధికారులు చె ప్పారు. ఒకట్రెండు రోజుల్లో వారితో మాట్లాడి, వారి అనుమానాలను నివృత్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ పాదర్శకంగానే వ్యవహరిస్తున్నామని, అయినప్పటికీ కొందరు అవగాహన లేకపోవడంతోనే సందేహిస్తున్నారని చెబుతున్నారు.
‘మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
మళ్లీ ఇక్కడికి తీసుకొస్తామనే హామీ ఏ ఒక్క అధికారి నుంచి రావడంలేదు. ఇది మాకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల కోసం ఇలా సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టడం సరికాద’ని దిలీప్ అనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా తాము మాత్రం కాలనీ నుంచి అడుగు బయట పెట్ట బోమన్నారు. అధికారులు తమ ప్రయ త్నాల ను మానుకునేవరకు ఆందోళన చేస్తుం టామని, మరిం త తీవ్రం చేస్తామని హెచ్చరించారు.