టోనీ బ్లెయిర్ తనయకు తుపాకీతో బెదిరింపు
ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తనయకూ దొంగల బెదిరింపులు తప్పలేదు. తుపాకితో బెదిరించి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించారు. ఐతే ఈ సంఘటనలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. న్యాయవాది అయిన 29 ఏళ్ల కేథరిన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు కుక్కను తీసుకుని లండన్ ప్రధాన వీధిలో వాకింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు డబ్చు, బంగారు నగలు ఇవ్వాల్సిందిగా వారిని తుపాకీతో బెదిరించారు.
ఐతే ఆ సమయంలో వారి వద్ద నగదు, ఖరీదైన వస్తువులు లేవు. దీంతో దొంగలు వారిని వదిలేసి పారిపోయారు. తమకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, ఐతే దిగ్ర్భాంతికి గురయ్యామని కేథరిన్ చెప్పింది. మెరిల్‌బోన్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.