రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
– రజక సంఘం ప్రధాన కార్యదర్శి కట్లయ్య డిమాండ్
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఒకే పని, ఒకే వృత్తి, ఒకే సామాజిక జీవనం గడిపే రజకులు ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా, మరో రాష్ట్రంలో బీసీలుగా ఉండడం దురదష్టకరమని రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక జిల్లా రజక సంఘ భవనంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన ప్రసంగించారు. 1955లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్, చాకలి వన్నారు కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారని, 1972లో పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్సింగ్ పంజాబ్ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చమని సిఫార్సు చేశారని దాంతో ఆయా రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారన్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి సిఫార్స్ చేసినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉండగా 12 రాష్ట్రాల్లో బీసీల్లో ఉండడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రజకులను ఎస్సీల జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘ నాయకులు కె.నాగన్న, కాకరపర్తి శ్రీను, వి.శ్రీహరి, చాగల్లు మండలం చంద్రవరం రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.