ప్రభాకర్ ఆత్మహత్యకు ఎమ్మెల్యేనే కారణం
► పెద్దపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
► టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
టవర్‌సర్కిల్ : పెద్దపల్లికి చెందిన కావేటి ప్రభాకర్‌ను చంపుతానని బెదిరింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్యకు పా ల్పడ్డాడని, అందుకు కారణమైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మిషన్‌కాకతీ య పనుల్లో భాగంగా పనరుద్ధరణ పనులు చేపడుతున్న ఎల్లమ్మ గుండమ్మ చెరువులో ఎమ్మెల్యే దాసరి కాంట్రాక్టర్ అవతారమెత్తారని ఆరోపించారు. ఎల్లమ్మ చెరువుకట్టపై ప్రభాకర్ పదిహేనేళ్లుగా రేకులు వేసుకుని నివాసముంటూ సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవిస్తున్నారన్నారు.
కట్టపై నుంచి ఖాళీ చేయాలని, లేదంటే చంపేస్తామని వారం రోజులుగా ఎమ్మెల్యే బెదిరిస్తే అతను ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి సంబంధంలేని టీడీపీ నాయకుడు బొడ్డుపెల్లి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశార న్నారు. చెరువు పనులకు, శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా మృతుడి భార్యతో తప్పుడు ఫిర్యాదు చేయించి అన్యాయంగా కేసు బనాయించారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు సత్తు మల్లయ్య, చెల్లోజి రాజు, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, ఆడెపు కమలాకర్, సందబోయిన రాజేశం, మిట్టపల్లి శ్రీనివాస్, వాణి, అనసూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.