కవాసాకి.. రెండు కొత్త లగ్జరీ బైకులు
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి తాజాగా జడ్1000, నింజా 1000 పేరిట భారత్‌లో రెండు ప్రీమియం సూపర్‌బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 12 లక్షలుగా (ఢిల్లీలో షోరూం ధర) ఉంటుంది. ఒక్కో మోడల్లో ఏటా కనీసం 100 బైక్‌లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ భారత విభాగం డిప్యూటీ ఎండీ నిస్కికావా షిగెటో తెలిపారు. అలాగే సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మరో రెండు మోడల్స్ (జడ్ఎక్స్-14ఆర్, జడ్ఎక్స్-10ఆర్) అమ్మకాలు సుమారు 50 దాకా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.
జడ్1000, నింజా 1000 బైక్‌లలో 1,043 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్లు ఉంటాయి. వీటిని జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని పుణె, ఢిల్లీలోని కవాసాకి షోరూమ్‌లలో విక్రయిస్తారు. కంపెనీ ఇప్పటికే నింజా 300, నింజా 600 బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి రేటు రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంది.