పరిశుభ్రతను పాటించే ఆస్పత్రులకు ప్రత్యేక బహుమతులు
ఎంజీఎం : స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచి సుందరీకరించడంలో, పేద రోగులకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తున్న పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులను ఎంపిక చేసి ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం తెలిపారు. కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ హాల్లో శనివారం ఎస్పీహెచ్ఓలతోపాటు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాం మాట్లాడుతూ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పరిసరాలు మెరుగుపరిచేందుకు కాయకల్ప్ కార్యక్రమం చేట్టినట్లు తెలిపారు. బహుమతులు సాధించిన జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర స్థాయిలో బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ సంజీవయ్య, ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రామింగ్ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, డిప్యూటీ డెమో స్వరూపరాణి, హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.