ఊరిస్తున్న ఉపాధి!
నిర్లక్ష్యం వీడని అధికార యంత్రాంగం
పట్టించుకోని {పభుత్వం..
సమీక్షించని ఎంపీలు
{పాజెక్టు మంజూరై ఐదేళ్లు..
పూర్తికాని రైల్వే వ్యాగన్ వర్కషాప్ భూ సేకరణ
వరంగల్ : కాజీపేట రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్‌తో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఐదేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరైనా.. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఎంతకూ ముందుకు కదలడం లేదు. ఇందుకు అవసరమైన భూములను సేకరించడంలో అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టు ఏర్పాటుపై సందేహం కలిగిస్తోంది. 2010-11 రైల్వే బడ్జెట్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతి(పీపీపీ)లో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని నిర్మాణానికి కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన 54.28 ఎకరాల భూమి అనువైనదిగా గుర్తించారు. ఈ భూమిని దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర రవాణా శాఖకు బదలాయించేందుకు కోర్టు అనుమతి అవసరం కాగా, ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత భూసేకరణ చేపట్టేందుకు రూ.18 కోట్లు కేటాయిస్తూ 2013 నవంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే నిధులు మాత్రం విడుదల కాకపోవడంతో భూసేకరణ నిలిచి, వర్క్‌షాప్ ఏర్పాటు అంశం అగిపోయింది. భూసేకరణ చేపట్టకపోవడంతో వర్క్‌షాప్ ఏర్పాటును ఇతర ప్రాంతాలకు తరలించాలని రైల్వే శాఖ యోచించింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం రూ.18 కోట్లు విడుదల చేస్తూ ఈ ఏడాది జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. అరుుతే సంబంధిత అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారు.. ఇంకెంత సేకరించాల్సి ఉంది అనే విషయంలోనూ స్పష్టత రావడం లేదు. కీలకమైన ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు. జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులూ దీనిపై స్పందించడం లేదు. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటు కొలిక్కి రావడంలేదు. ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్న యువతకు భూసేకరణ, ప్రాజెక్టు ఏర్పాటులో జాప్యం ఆందోళన కలిగిస్తోంది.