కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
కీసర, న్యూస్‌లైన్: కీసరగుట్టలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జాతర జరిగే ప్రాంతంలో చేపడుతున్న ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఐదు లక్షల వరకు భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం తుది సమావేశం ఉన్న దృష్ట్యా ఆలోపు పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ యేడాది జాతరలో భక్తులకు లభించే సౌకర్యాలు ఇలా ఉండబోతున్నాయి...
స్వామివారి దర్శనానంతరం పంచామృతతీర్థం, పూజించిన బిల్వపత్రాలను ప్రసాదంగా అందజేస్తారు.
క్యూలై న్లలో నిల్చుండే భక్తులకు లింగాష్టకం- శివాష్టకంతో కూడిన చిన్నసైజు కరపత్రాల పంపిణీ.
దాతల సహకారంతో ఉచితంగా మంచినీటిప్యాకెట్లు, చిన్నపిల్లలు ఉంటే పాలప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకేట్ల సరఫరా.
ప్రస్తుతానికి లక్ష లడ్డూ ప్రసాదాలు సిద్ధం. రద్దీని బట్టి ప్రసాదాల పంపిణీకి చర్యలు.
వీవీఐపీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు.
జాతర జరిగే ప్రాంతంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 1,700 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.
24 గంటల పాటు మంచినీటి సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానపు గదులు, తాత్కాలికంగా మరుగుదొడ్లను నిర్మించారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు అదనంగా ఆరు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఒక జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు.
వాహనాల పార్కింగ్ కోసం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల వెనుక స్థలాన్ని చదునుచేశారు.
జిల్లాస్థాయి క్రీడోత్సవాల సందర్భంగా క్రీడాకారులకు క్రీడాప్రాంగణంలోనే భోజన ఏర్పాట్లు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్టకు సుమారు 250 ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. మహాశివరాత్రి ఆ మరుసటిరోజు ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
గర్భాలయంలో జరిగే ఆర్జిత సేవలన్నీ మారుతి కాశీవిశ్వేరస్వామి ఆలయంలో జరుగుతాయి.
జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
జాతరకు వచ్చే వికలాంగులు, వృద్ధులను దేవాలయం వరకూ చేరవేసేందుకు బస్టాప్, పార్కింగ్‌స్థలం నుంచి ప్రత్యేక వాహన సదుపాయం.
యాత్రికులకు ఎప్పటికప్పుడు తగు సమాచారం ఇచ్చేందుకు కీసరవాణిని సిద్ధం చేశారు.