తమిళనాడులో హరప్ప నాగరికత!
శివగంగ: హరప్ప నాగరికతను పోలిన ఆనవాళ్లను ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు చెందిన నిపుణులు తమిళనాడులోని కీజడీ పళ్లయ్ సందాయ్ పుదూర్ లో కనుగొన్నారు. ఆ ప్రాంతంలో ఏఎస్ఐ చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన మట్టితో చేసిన రాజముద్ర 3వేల ఏళ్ల కిందటిగా గుర్తించారు. ఇక్కడ నివాసమున్న పూర్వీకులకు హరప్ప నాగరికతను పోలిన డ్రైనేజ్ సిస్టంను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. డ్రైనేజీ సిస్టంను తయారుచేయడానికి మట్టితో తయారుచేసిన పైపులైన్ల వాడినట్లు గుర్తించామని వివరించారు.
ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఏఎస్ఐ అధికారుల పరిశీలన సెప్టెంబర్లో ముగియనున్నట్లు సూపరింటెండెంట్ కే అమర్ నాథ్ రామకృష్ణ తెలిపారు. దాదాపు 2,500ఏళ్ల కిందట డ్రైనేజ్ సిస్టంను నిర్మించారని ఇది పాండ్యులకు చెందిన టెక్నాలజీగా పేర్కొన్నారు. రాజ ముద్రలతో పాటు బాణాలు, ఇనుము, కాపర్ ఆయుధాలు, ఆభరణాలు తవ్వకాల్లో దొరికినట్లు రామకృష్ణ వివరించారు. తమిళుల నాగరికతను తెలుసుకోవడానికి ఇవి మరింతగా ఉపయోగపడతాయని తెలిపారు. వ్యాపార నిమిత్తం రాజముద్రలను వ్యాపారల ద్వారా ఇక్కడకు చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.