సునీత.. మరో రబ్డీ అయ్యేనా...?!
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది. చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే అయినా, ఆప్‌లో నాయకత్వ లేమిని ఈ పరిణామం బట్టబయలు చేసింది. మద్యం కేసులోని ఇతర నిందితుల్లా కేజ్రీవాల్ కూడా దీర్ఘకాలం పాటు జైలుకే పరిమితమైతే ఆప్ పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులుగా ఆయన భార్య సునీత పేరు తెరపైకి వస్తోంది. భర్త స్థానంలో ఆప్ పగ్గాలతో పాటు ఢిల్లీ సీఎం బాధ్యతలనూ ఆమె చేపట్టవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు అనుకూల, వ్యతిరేక వాదనలు జోరుగా సాగుతున్నాయి...
1997లో నాటి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుపాలు కావడంతో భార్య రబ్డీదేవిని ముఖ్యమంత్రిని చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాగే సునీత కూడా రాజకీయ అరంగేట్రం చేయవచ్చంటూ ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ శనివారం ప్రజలనుద్దేశించి పంపిన వీడియో సందేశాన్ని పార్టీ నేతలకు బదులు సునీత చదివి విని్పంచడం ఇందుకు సంకేతమంటూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ఆ సందర్భంగా ఆమె కేజ్రీవాల్ కురీ్చలో కూర్చోవడం యాదృచ్చికమేమీ కాదని కూడా అంటున్నారు. అరవింద్, సునీత ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులే. శిక్షణ సందర్భంగా ఏర్పడ్డ సాన్నిహిత్యం పెళ్లికి దారితీసింది. ముందుగా కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేసి హక్కుల కార్యకర్తగా మారారు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారు. ఆయన సీఎం అయ్యాక సునీత కూడా ఐఆర్ఎస్కు రాజీనామా చేశారు.
అప్పుడప్పుడు భర్తతో పాటు పార్టీ ప్రచారంలో పాల్గొనడం, ఆప్ ఎన్నికల విజయాలపై స్పందించడం తప్ప రాజకీయంగా చురుగ్గా ఉన్నది లేదు. పారీ్టలో కూడా ఆమె ఎలాంటి పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సందేశాన్ని ఆప్ నేతలు కాకుండా సునీత చదివి విని్పంచడం ఒక్కసారిగా ఊహాగానాలకు తావిచ్చింది. వాటిపై మిశ్రమ స్పందనలూ వస్తున్నాయి. ‘‘సునీతకు పగ్గాలప్పగిస్తే సానుభూతి కూడా ఆప్‌కు కలిసొస్తుంది.
కష్టకాలం నుంచి పార్టీని ఆమె బయట పడేస్తారు. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ లోటును కూడా భర్తీ చేస్తారు’’ అని కొందరంటున్నారు. భర్త తరఫున ఆయన సందేశాన్ని విని్పంచినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తారని అనుకోలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆమె కూర్చున్నది సీఎం కుర్చీ ఏమీ కాదు. తమ నివాసంలో కేజ్రీవాల్ మీడియాతో భేటీ అయ్యే కురీ్చలో కూర్చున్నారంతే. దాన్ని అధికార మార్పిడికి సంకేతంగా చూడటం సరికాదు’’ అన్నది వారి వాదన.
సునీత రాజకీయ ఎంట్రీ వార్తలపై ఆప్ మౌనం వహిస్తోంది. ఆప్ నేతల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాత్రమే దీనిపై పెదవి విప్పారు. ఆయన కూడా ఈ విషయమై తనకెలాంటి సమాచారమూ లేదని చెప్పడంతోనే సరిపెట్టారు. బీజేపీ మాత్రం అప్పుడే ముందస్తు విమర్శలతో హోరెత్తిస్తోంది. ఆప్ నాయకత్వ రేసులో చివరికి కేజ్రీవాల్ భార్య కూడా చేరారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ గతంలో చేసిన వాగ్దానాలను వరుసబెట్టి తుంగలో తొక్కుతుంటే సునీత ఎక్కడున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్