ఢిల్లీ అసెంబ్లీలో మిశ్రాపై దాడి
ఆప్ ఎమ్మెల్యేల దుశ్చర్య
న్యూఢిల్లీ: ఆప్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై నిండు సభలో దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆప్ ఎమ్మెల్యేలు బుధవారం ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఆయన గొంతు నులిమేంత పనిచేశాడు. మరొకరు పిడిగుద్దులు గుద్దాడు. సీఎం కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేలు ఈ చర్యకు పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్ మిశ్రాను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.
మిశ్రా మాట్లాడుతూ కేజ్రీవాల్ అవినీతిపై చర్చించేందుకు రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సభలో డిమాండ్ చేయడంతో తనపై ఆప్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. జీఎస్టీ బిల్లుపై చర్చ అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా సభకు హాజరైన మిశ్రా రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని రాసి ఉన్న బ్యానర్‌ను సభలో ప్రదర్శించారు. స్పీకర్ ఆయనను వారించారు. ఈ సందర్భంగానే మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు భౌతిక దాడికి పాల్పడ్డారు.