గొడవలు వద్దు..
తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ఉండాలని టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోదీ వ్యాఖ్య
తెలంగాణ, ఏపీ కలసి అభివృద్ధిలో ముందుకెళ్లాలి
తెలంగాణకు కేంద్రం అండ ఉంటుందని వెల్లడి
రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతోనూ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దు. సామరస్యంగా అభివృద్ధిలో ముందుకు వెళ్లండి. ఇద్దరు సీఎంలు కల సిమెలసి ఉండాలి. తెలంగాణకు కేంద్రం అండ ఉంటుంది. విభజన హామీలన్నీ నెరవేరతా యి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తనను కలిసి టీఆర్ఎస్ ఎంపీలకు హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, నగేశ్, బీబీపాటిల్ తదితరులు బుధవారం పార్లమెంట్‌లోని ప్రధాని చాంబర్లో మోదీని కలిశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణచట్టంలో ఇచ్చిన హామీలు, తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తుతున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని మోదీ సూచించారు. దీనిపై టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘సర్ మేం ఎలాంటి గొడవలు పెట్టుకోలేదు. తెలంగాణలోని ఏ పోలీస్స్టేషన్లోనూ వివక్ష దాడులు జరిగినట్టు కేసులు నమోదు కాలేదు.
అనవసరంగా ఏపీ ప్రభుత్వం వివాదాలు రేపుతోంది. కనీసం తెలంగాణ సీఎంకు చెప్పకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దేశీయ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టారు..’’ అని చెబుతూ కేంద్ర ప్రభు త్వ జీవోను ప్రధానికి చూపారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తప్పు. ఈ విధంగా జరిగి ఉండాల్సింది కాదు’’ అని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ బృందం రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతోనూ సమావేశమై.. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై నియోజకవర్గాలవారీగా ప్రతిపాదనలు ఇచ్చారు.
ఈ భేటీల వివరాలను రాత్రి ఢిల్లీలోని తెలంగాణభవ న్లో విలేకరులకు వెల్లడించారు. తొలుత కె.కేశవరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీల అంశాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన పూర్తికాకపోవడంతో పాలన పరంగా ఇబ్బందులు వస్తున్నాయని.. అధికారులు విభజనను త్వరగా పూర్తి చేసేలా డీవోపీని ఆదేశించాలని కోరామని తెలిపారు.
జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధానిని కోరినట్టు చెప్పారు. అన్ని విషయాల్లోనూ తెలంగాణకు కేంద్రం అండ ఉంటుందని భరోసా ఇచ్చినట్టు వివరించారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో నూ ఇద్దరు చంద్రులు సీఎంలుగా ఉన్నారని, చంద్రుల్లా ఇద్దరు శాంతియుతంగా పనిచేసుకోవాలని ప్రధాని పేర్కొన్నట్లు చెప్పారు.