కలల పంట పండింది !
అవగాహనలేని సాగు.... అయినా ఆసక్తి ఆయన్ను ముందుకు నడిపించింది. ఇష్టం...కష్టాన్ని మరిపించింది. చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు, రైతుగా ముందుకు సాగేందుకు ఆయన పడిన తపన ఇప్పుడు లాభాలు కురిపిస్తోంది. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. అధ్యయనం, శిక్షణ, నిరంతర పర్యవేక్షణ ఆయనకు తోడుగా నిలిచాయి.
విజయనగరం వ్యవసాయం: పుట్టగొడుగుల పెంపకం కత్తిమీద సాములాంటిది. నిరంతరం పర్యవేక్షిస్తూ నీరు అందిస్తుండాలి. బెడ్ల తయారీ నుంచి కట్ చేయడం వరకూ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ చూపాలి. పంటసాగు విధానం తెలియకపోతే నష్టాలు తప్పవు. దీంతో అతి తక్కువమంది మాత్రమే పుట్టగొడుగులను సాగుచేసేందుకు సాహసిస్తున్నారు. ఇంత కష్టతరమైన సాగును లాభసాటిగా మలుచుకుని అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలిచారు విజయనగరం మండలం పాత దుప్పాడ గ్రామానికి చెందిన కెల్ల బంగారు నాయుడు అనే రైతు. డిగ్రీ వరకు చదువుకున్న బంగారునాయుడుకు చిన్నప్పటి నుంచి పుట్టగొడుగులు సాగు చేయాలనే కోరిక ఉండేది. మూడేళ్ల క్రితం రూ. 4.50 లక్షల పెట్టుబడితో ఈ సాగు ప్రారంభించారు. ఈ పంటపై జిల్లాలో రైతులకు దీనిపై పెద్దగా అవగాహన లేదు.
దీంతో బంగారు నాయుడు హిమాచలప్రదేశ్ వెళ్లి మూడు రోజుల పాటు పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకున్నారు. మొదట రెండు షెడ్డులు నిర్మించి సాగు ప్రారంభించారు. సాగు చేపట్టిన తొలినాళ్లలో కలిసిరాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకనాక దశలో సాగు మానేయాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించేలా చేసింది. సాగును మధ్యలో వదిలేయడం మంచిదికాని భావించి లోటు పాట్లును గుర్తించి వాటిని అధిగిమించారు. రెండేళ్ల నుంచి పుట్ట గొడుగులకు డిమాండ్ పెరగడంతో సాగులాభదాయకంగా మారింది. పెట్టుబడి తిరిగి వచ్చేయడంతో పాటు నెలకు రూ. 30 వేలకుపైగా ఆదాయం రావడంతో ఇప్పుడు సాగును విస్తీర్ణం పెంచాలనే యోచన లో బంగారునాయుడు ఉన్నారు.
బెడ్ల తయారీయే కీలకం
పుట్టగొడుగుల సాగులో ప్రధానమైనది బెడ్ తయారీ. ఎండు గడ్డిని ముక్కలు కట్ చేసి నానబెట్టాలి. అలా నానబెట్టిన గడ్డిని గంట పాటు ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత 14-20 సైజ్ పాలిథిన్ కవరల్లో మూడు అంగుళాలు వరకు ఎండబెట్టిన గడ్డిన వేయాలి. అందులో 25 గ్రాముల పుట్టగొడుగుల విత్తనాన్ని వేయాలి. ఆ తర్వాత మూడు అంగుళాల వరకు గడ్డిని వేయాలి. ఆ తర్వాత 25 గ్రాముల విత్తనాన్ని వేయాలి. ఇలా ఐదు లేయర్లు వేయాలి. ఒక బెడ్లో 125 గ్రాముల చొప్పున కేజీ విత్తనం ఎనిమిది బెడ్లు వరకు వస్తుంది. బెడ్లను 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. అదే విధంగా తేమ 85 నుంచి 90 శాతం ఉండేటట్టు చూడాలి. గాలి నిరంతరం తగిలేచూడాలి. రోజుకు మూడు పర్యాయాలు తడపాలి. అలాగే చీడపీడలు సోకకుండా జాగ్రత్త వహించాలి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని విస్మరించినా కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
365 రోజులూ పెంపకం
చాలా మంది సీజన్ వారీగా ఈ పెంపకం చేపడుతుండగా, బంగారు నాయుడు మాత్రం 365 రోజులూ ఈ సాగు చేస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాకు అనువైన రకాలను ఎంచుకుని పండిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు వెల్మా అనే రకాన్ని, మార్చి నుంచి ఆగస్టు వరకు మిల్క్వైట్ రకాన్ని సాగు చేస్తున్నారు.
రోజుకు 10 కిలోల ఉత్పత్తి
రోజుకు 10 కిలోల వరకు పుట్టగొడుగులు ఉత్పత్తి సాధిస్తున్నారు. సాగు చేపట్టిన తొలినాళ్లలో పెద్దగా ఆర్డర్లు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఆర్డర్లు మీద ఆర్డర్లు వచ్చి పడుతున్నారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పెట్టే విందు భోజనాల్లో పుట్టగొడుగులను విరివిగా వినియోగిస్తుండడంతో ఆర్డర్లు ఎక్కువుగా వస్తున్నాయి. దీంతో రోజు వచ్చిన ఉత్పత్తి చాలడం లేదు. విస్తీర్ణం పెంచాలనే అలోచనలో ఉన్నారు.
ఇంటి వద్దే సాగు
ఇంటి వద్దే పుట్టగొడుగుల సాగును చేపట్టాను. ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. 365 రోజులూ సాగు చేస్తున్నాను. నెలకు ఇప్పుడు రూ.10వేల వరకూ పెట్టుబడి పెడితే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు వరకు ఆదాయం వస్తోంది. రైతు బజార్లకు, వివాహాలకు పుట్టగొడుగులను సరఫరా చేస్తున్నాను. అధికంగా ఆదాయం రావడంతో ఆనందంగా ఉంది. సాగు చేపట్టిన తొలినాళ్లలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. మానేద్దాం అనిపించింది. కాని సాగుపై ఉన్న ఆసక్తితో వెనుకడుగువేయలేదు. అదే ఈరోజు నాకు ఎంతో ఊరటినిచ్చింది.
- కెల్లబంగారునాయుడు, రైతు , పాతదుప్పాడ