ప్రాణం తీసిన చిన్నగొడవ
ములుగు : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో భార్య పురుగుల మందు తాగింది. ఆమె చనిపోతుందేమోనని భర్త సైతం అదే పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య చికిత్ప పొందుతోంది. ఈ సంఘటన గురువారం మండలంలోని పత్తిపల్లి శివారు చిత్తకుంటలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు.. నల్లబెల్లి మండలం గుల్లపాడుకు చెం దిన కేలోతు ఇడియాల్-చంద్రకళ దంపతుల ప్రథమ కుమారుడు కేలోతు రాజు(26)కు అ దే గ్రామానికి చెందిన తేజావత్ జేత్యా-కమలమ్మ దంపతుల కుమార్తె అనితతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. గ్రామంలో ఉపా ధి లేక ఆరేళ్ల క్రితం ములుగు మండలం చిం తకుంటకు వలస వచ్చారు.
భార్యాభర్తలు స్థా నికంగా కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ సంవత్సరం మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పెట్టుబడి కోసం కొంత అప్పు చేశారు. అయితే గత 10 రోజులుగా దంపతులకు పెట్టుబడి కోసం డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పెట్టుబడి డబ్బులు కావాలని భార్య అనిత భర్తను అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బుధవారం సాయంత్రం గొడవ జరిగింది.
దీంతో మనస్తాపానికి గురైన అనిత ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి భర్త రాజుపై మండిపడ్డారు. భార్య ఎక్కడ చనిపోతుందోనని భయంతో రాజు సైతం పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు భార్యాభర్తలను ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు మృతి చెందగా భార్య అనిత చికిత్స పొందుతోంది. కాగా, రాజుకు ఇంద్రజ(6), నందిని(4), ఈశ్వర్(2) సంతానం. తండ్రి చనిపోరుు, తల్లి చికిత్స పొందుతుండగా పిల్లల రోదన పలువురిని కలిచివేసింది.
నాకు దిక్కెవరు
నానా ఇబ్బందులు పడి భర్త సహకారంతో పిల్లలను సాదుకుంటున్నా. అండగా ఉండాల్సి భర్త మృతి చెందాడు. ఊహ తెలియని ముగ్గురు పిల్లలు, రూపాయి ఆదాయం లేని జీవితం ఈ పరిస్తితిలో ఎలా బతకాలని, తనకు ఎవరు దిక్కని భార్య అనిత ఆసుపత్రిలో చేసిన రోదన పలువురిని కన్నీరు కార్చేలా చేసింది.
పేదరికమే కారణం..
రాజు అనితల వివాహం జరిగినప్పటి నుంచి భార్యాభర్తలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడ్డారు. స్వగ్రామం గుండ్లపహాడ్లో ఎదుర్కున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చింతకుంటకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలు కూలీ చేసుకొని బతికిన దంపతులు ఈ సంవత్సరమే కౌలు తీసుకొని పంటసాగు చేశారు. ఐతే పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.