కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం..
తిరువనంతపురంః పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులకు పూర్తిస్థాయి మద్దతునిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. రక్షణ రేఖ వెంబడి ఏడు ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యానికి అభినందనలు తెలిపింది. సర్జికల్ స్ట్రైక్ కు పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
దేశాన్ని, ప్రజలను రక్షించేందుకు సైన్యం చేపట్టిన చర్యలను కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా అభినందించింది. దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలతో పరిస్థితి మరింత హీన స్థితికి దిగజారకుండా నివారించాలని, సమస్యకు పరిష్కారం కనుగోవాలని తీర్మానం ద్వారా వెల్లడించింది. దేశాన్ని, ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకున్న భారత ఆర్మీకి అసెంబ్లీ పూర్తిస్థాయి మద్దతును ప్రకటించింది. పఠాన్ కోట్, ఉడి వంటి దాడులను నిరోధించేందుకు ఇకపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. దౌత్య స్థాయిలో సమస్యకు ఓ పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది.
ఈ నేపథ్యంలో క్లుప్తంగా ప్రసంగించిన అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల భారతసైన్యం తెలివైన చర్యకు సాల్యూట్ చెప్పారు. . ప్రభుత్వ విధానాలకు పూర్తి మద్దతు పలుకుతున్నామన్న ఆయన.. చాలాకాలంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్నిభారత్ కు ఎగుమతి చేస్తోందని, అందుకు ఇండియన్ ఆర్మీ గట్టి జవాబునివ్వడం మెచ్చుకోదగిన చర్య అని అన్నారు.