ధోనీని అవమానిస్తారా.. మీ సైట్లు హ్యాక్!
భారతీయులకు కోపం వచ్చింది. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ తలను బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ తీసుకెళ్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటో ఒకదాన్ని ప్రచారం చేయడంతో పలు బంగ్లాదేశీ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. మూడు ప్రభుత్వ సైట్లు సహా సుమారు 20 వరకు సైట్లను భారతీయులు హ్యాక్ చేసి, ఆ విషయాన్ని ఆ సైట్ల హోం పేజిలో తెలిపారు. కేరళ సైబర్ వారియర్స్‌కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ''బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే. మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు'' అన్న సందేశంతో పాటు ప్రతి సైట్లోనూ ధోనీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' అని ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు.
తామంతా భారతీయులైనందుకు గర్వపడుతున్నామని, దేశాన్ని అవమానించే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఈ బృందానికి చెందిన ఓవ్యక్తి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ధోనీ మార్ఫింగ్ ఫొటోతో అతడిని అవమానించారని, దానికి ధోనీ మైదానంలో సమాధానం చెబితే తాము సైబర్ స్పేస్‌లో సమాధానం చెబుతున్నామని అన్నారు. మరిన్ని వెబ్సైట్లను హ్యాక్ చేయడం ఖాయమని, మరేదైనా సైట్లో ధోనీ మార్ఫింగ్ ఫొటో కనిపిస్తే అది హ్యాక్ అయి తీరుతుందని హెచ్చరించారు. వెబ్సైట్లను హ్యాక్ చేయడం అక్రమమేనని తమకు తెలుసని చెప్పారు. ఇంతకుముందు అమాయకులైన అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటితో సెక్స్ చాట్లు చేస్తున్న పలు ఫేస్బుక్ పేజీలను, ప్రొఫైళ్లను కూడా తాము హ్యాక్ చేశామని అంటున్నారు. ప్రతియేటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సహా 26/11 రోజున కూడా పలు పాకిస్థానీ వెబ్సైట్ల మీద కూడా కేరళ సైబర్ వారియర్స్ దాడి చేస్తారు.