ఇంత భారీ ఓటమి ఊహించలేదు: సీఎం
ఇంత దారుణమైన, భారీ ఓటమిని తాము ఊహించలేదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ఫైనల్ అని, ఎన్నడూ ఊహించని ఓటమిని అంగీకరిస్తున్నామని పుత్తుపల్లిలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే తాము భావించాము గానీ అలా జరగలేదన్నారు. ఎందుకిలా జరిగిందన్న విషయాన్ని అంచనా వేసేందుకు చర్చించుకుంటామన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు మాత్రం కేవలం 23 మంది మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూడీఎఫ్ కూటమి మొత్తానికి 46 సీట్లు వచ్చేలా ఉన్నాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కటమికి 92 స్థానాలు వచ్చేలా ఉన్నాయి. బీజేపీ కేవలం ఒక్కచోట గెలిచింది. అయినా.. ఆ పార్టీ కేరళలో బోణీ కొట్టడం ఇదే మొదలు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పీసీ జార్జి కూడా గెలిచారు. యూడీఎఫ్ చైర్మన్గా కూడా తాను ఈ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఊమెన్ చాందీ చెప్పారు.