వెంట్రుకల నెక్లెస్
హెయిర్ ఆర్ట్
తలపైన నల్లగా నిగనిగలాడుతూ ఒత్తై జుట్టు ఉంటే మనిషికి అందం. అదే వెంట్రుకలు రాలిపోతుంటే విపరీతమైన బాధ. కానీ, ఊడిన వెంట్రుకలు మెడలో హారాలుగా మారితే..!! ఈ ఆలోచనతోనే వెంట్రుకలతో నెక్లెస్‌లను రూపొందించడం మొదలుపెట్టారు లండన్‌కు చెందిన పాతికేళ్ల కెర్రీ హౌలేస్. లోహపు ఆభరణాల అంతటా ఉన్నవే, వాటిలో ప్రత్యేకత ఏముంది?
కొత్త ఆలోచనతో క్రొంగొత్త ఆభరణాలను ధరిస్తేనే మన ప్రత్యేకత నలుగురికీ తెలిసేది అంటున్నారు ఈ విభిన్నమైన డిజైనర్. అయితే, వెంట్రుకలతో ఒక నెక్లెస్ తయారుచేయడానికి 60 గంటలకు పైనే సమయం పట్టిందట.
మొదట తన తల్లి శిరోజాలనూ, ఆమె స్నేహితుల వెంట్రుకలనూ ఇందుకోసం సేకరించి, పగలూ రాత్రి తేడా లేకుండా వెంట్రుకల హారాలను కెర్రీ తయారుచేసిందంట. వెంట్రుకల హారాలు నలుగురికి పరిచయడం కోసం ఎన్నో ఎగ్జిబిషన్లనూ నిర్వహించింది. ఎన్నో అవార్డులూ సొంతం చేసుకుంది.