నేను నోరు జారడం పొరపాటే: కెర్రీ ఓకీఫ్
మెల్బోర్న్: భారత దేశవాళీ క్రికెట్‌ను ఉద్దేశించిన కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెర్రీ ఓకీఫ్ తనను క్షమించాలంటూ బహిరంగ లేఖ రాశాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న ఓకీఫ్.. నోరు జారడం పొరపాటేనని అంగీకరించాడు. బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు అరంగేట్రం ఆటగాడు మయాంక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడు రంజీల్లో రైల్వే క్యాంటీన్ జట్టుపై త్రిశతకం చేశాడని ఎగతాళి చేశాడు. రంజీ క్రికెట్ స్థాయిని తక్కువ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు చెలరేగాయి. దీనిపై వివరణ ఇచ్చుకున్న ఓకీఫ్.. భారత క్రికెటర్లతో పాటు అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు.
‘భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యల స్పందనకు కుంగిపోయా. నా మాటల్లో ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ప్రతిబింబించారు. నా అసలు ఉద్దేశం వేరు. తీవ్రంగా సాగుతున్న వ్యాఖ్యానాన్ని సరదాగా మార్చాలని అనుకున్నా. ఈ క్రమంలో నోరు జారి రైల్వే క్యాంటీన్ పదాల్ని వాడాను. అంతే తప్ప భారత క్రికెట్‌ను అగౌరవ పరచలేదు. ఒక పాఠశాల విద్యార్థిగా నేను పర్యటించిన భారత్..ఇప్పుడు అద్భుతమైన క్రికెట్ దేశంగా ఎదిగింది. సిరీస్‌కు ముందు ఆటగాళ్లపై ఎంతో పరిశోధన చేస్తా. రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారాను అవమానించలేదు. నాపై నేనే జోక్ వేసుకున్నా’ అని ఓకీఫ్ పేర్కొన్నాడు.