కేశవదాసుపాలెంలో గ్యాస్ లీకేజీ
రెండు వారాల్లో మూడుసార్లు ఇలా..
తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న సిబ్బంది
సఖినేటిపల్లి(రాజోలు) : కేశవదాసుపాలెంలో మంగళవారం ఉదయం వరి చేలో గ్యాస్ లీకేజీ అయింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఎగజిమ్మిన గ్యాస్ క్రమేపీ తగ్గుముఖం పట్టింది. భూగర్భంలో పుష్కర కాలం క్రితం వేసిన పైపులైన్లు తుప్పుపట్టి, పైపునకు ఏర్పడిన పిన్‌హోల్ నుంచి ఈ గ్యాస్ పైకి వచ్చింది. మండలంలోని అంతర్వేదికరలో కేవీ 13, 14, 15 బావులకు సంబంధించిన పైపులైన్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఏడు బావుల పైపులైన్లు కేశవదాసుపాలెం వరిపొలాలు మీదుగా మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్‌కు వేశారు. స్థానిక రైతు బెల్లంకొండ నారాయణ రావు వరిచేల మీదుగా వెళ్లిన ఈ లైన్లుల్లో ఏ పైపులైను నుంచి గ్యాస్ లీకేజీ అవుతోందో గుర్తించడానికి ఓఎన్జీసీ సిబ్బందికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు కేవీ 15 బావి నుంచి మోరి జీసీఎస్‌కు వెళ్లిన గ్యాస్‌పైపులైనులో లీకేజీ అవుతున్నట్టుగా గుర్తించి, తదనుగుణంగా పైపులైనులో గ్యాస్‌ను అదుపు చేయడంతో పరిస్థితి చక్కబడింది. గ్యాస్ అదుపులోకి తెచ్చిన సిబ్బంది పైపునకు మరమ్మతులు చేశారు. తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ ఆదేశాలతో రాజోలు ఫైర్‌స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలంలో మోహరించారు.