నెహ్రూపై నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు!
'ఉక్కు మనిషి' సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ..కాశ్మీర్ సమస్య ఇప్పటికి రావణకాష్టంలా మండటానికి కారణం జవహర్ లాల్ నెహ్లూ' అని వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ప్రధాని అయ్యుంటే బాగుండేదని అన్ని తరాల యువత భావిస్తునే ఉంది అని మోడీ వ్యాఖ్యానించారు.
నిజాం ప్రభుత్వంపై సైనిక చర్య ప్రతిపాదనను అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నాడని.. అయితే నెహ్రూ విదేశాలకు వెళ్లిన సమయంలో సర్ధార్ పటేల్ అదను చూసి నిజాం ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదరాబాద్ స్టేట్ కు విమోచనం కలిగించారని.. సర్దార్ నిర్ణయం వలన మనమందరం క్షేమంగా ఉన్నాం అని మోడీ అన్నారు. 500 సంస్థానాలను భారత్ లో కలిపే పనిని పటేల్ కు నెహ్రూ అప్పగించారని అయితే కాశ్మీర్ సమస్యను తన వద్దే ఉంచుకున్నారన్నారు. పటేల్ తనకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని..అయితే నెహ్రూ మాత్రం కాశ్మీర్ సమస్యను ఎప్పటికి పరిష్కరించలేకపోయాడని మోడీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికి కాశ్మీర్ పండితులు వేధింపులకు గురవ్వడం చూస్తే.. సర్దార్ పటేల్ గుర్తుకు వస్తాడన్నారు. దేశ నిర్మాణంలో పటేల్ సేవలు రాజకీయ కారణాల వల్ల వెలుగులోకి రాలేదని మోడీ విమర్శించారు. భారత దేశ చరిత్రలో చాణక్యుడి తర్వాత దేశాన్ని ఐక్యం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరే అని అన్నారు. పటేల్ సేవలకు గుర్తుగా స్టాట్యూ ఆఫ్ యూనిటిని గుజరాత్ ప్రభుత్వం నిర్మించడానికి సిద్దమవుతోందన్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటి విగ్రహ కార్యక్రమం ఆక్టోబర్ 31 తేదిన ఆరంభం అవుతుందని మోడీ తెలిపారు.