‘ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోండి’
విజయవాడ: కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కార్మికశాఖ కమిషనర్‌ను కలిశారు. జీతాలు చెల్లించమని అడిగితే తమపై దాడి చేశారని వారు ఈ సందర్భంగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి, ఎంపీ కేశినేని నానిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెప్పాపెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారన్నారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యామని, ఇంకా తమకు అన్యాయం చేయొద్దంటూ కేశినేని ట్రావెల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. గతవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. అప్పటి నుంచి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కార్మికశాఖ కమిషనర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.