ఆ విషయం చంద్రబాబుకెలా తెలిసింది?
ధర్మవరం అర్బన్ : రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుపై ఎన్డీఏ భాగస్వామ్యంలోని పార్టీల నాయకులు, కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందించినట్లు ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన పట్టణంలోని స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కొత్తనోట్లను ముద్రించాలని, పాతనోట్లను రద్దు చేయాలని అనుకుంటున్నట్లు రెండేళ్ల నుంచే ప్రచారం సాగుతూ వచ్చిందన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నెలక్రితమే తాను సూచించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
నోట్ల రద్దు విషయం ముందుగా తెలియడం వల్లే చంద్రబాబు రెండురోజుల ముందే తనకు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 124 హెరిటేజ్ ఔట్లెట్లను ఫ్యూచర్ గ్రూప్‌నకు బదిలీ చేశారని విమర్శించారు. నోట్ల రద్దుపై ముందుగానే కార్పొరేట్ సంస్థలు, ఎన్డీఏ భాగస్వాములకు లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని కార్యాలయ సిబ్బంది లేదా ఇంకెవరైనా సరే వారిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై ముందుగానే తెలుసుకున్న రిలయ¯Œ్స అధినేత జియో సిమ్‌లలో నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టి డిసెంబర్ 31 వరకు ఉచితంగా నెట్, కాల్స్ ఇస్తున్నారన్నారు. నోట్ల రద్దుతో మధ్యతరగతి, పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నారు.