మహిళపై చెప్పులతో దాడి, అవమాన భారంతో ఆత్మహత్య
బెంగళూరు : తాగునీరు పట్టుకునే విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. ఇక్కడి కేజీహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు.. నాగవారలోని ఏకే కాలనీలో సునీత (38) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఇంటి పక్కనే చిక్కతాయమ్మ, మంజుల అనే ఇద్దరు ఉంటున్నారు. సోమవారం సాయంత్రం వీధి కుళాయిలో తాగునీరు పట్టుకునే విషయంలో సునీతతో చిక్కతాయమ్మ, మంజుల గొడవపడ్డారు. ఆ సమయంలో స్థానికులు సర్దిచెప్పడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
రాత్రి 8 గంటల సమయంలో మంజుల, చిక్కతాయమ్మ కలిసి సునీత ఇంటి దగ్గరకు వెళ్లారు. ఆ సందర్భంలో ఇద్దరు సునీతతో మరోసారి గొడవపడి దుర్భాషలాడారు. గొడవ చేయొద్దని సునీత ప్రాధేయపడినా వారు వినకపోగా ఆమెపై చెప్పులతో దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సునీత రాత్రి 10 గంటల సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రిపోద్దుపోయిన తరువాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల, చిక్కతాయమ్మ పరారీలో ఉన్నారని, మంగళవారం డీసీపీ డాక్టర్ హర్ష తెలిపారు.