సమభావం.. స్నేహసౌభాగ్యం
ప్రేమానురాగాలతో కూడిన స్నేహమే గొప్పది. సాటి వారికి ప్రేమను పంచండి.. ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించండి.. ఇదే ఇస్లాం ఆశయం. ఇస్లాంలో స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. స్నేహితులను ప్రేమాభిమానాలతో చూడాలి. అత్యంత ప్రీతిపాత్రులుగా ఉండాలి. దరిద్రులంటే ధనం లేని వారు కాదు.. వాస్తవానికి మిత్రులు లేనివారే గొప్ప దరిద్రులు. మిత్రుడు జీవితానికి అలంకరణ, జీవనయాత్రలో సహాయకారి. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా ఉండాలి. అప్పుడే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు మదనపల్లె పట్టణానికి చెందిన ప్రముఖ మతగురువు మౌల్వీ షాకీరుల్లాసాహెబ్ లతీఫ్.
మదనపల్లె సిటీ: ఏ వ్యక్తి అయితే ఇతరులను ప్రేమించడో, ఆ వ్యక్తిలో ఎలాంటి మంచితనం గాని, శుభం గానీ ఉండవు. ప్రజలతో కలిసిమెలసి ఉంటూ వారి వల్ల కలిగే బాధలను సహించే విశ్వాసి. ప్రజలకు దూరంగా ఉంటూ వారి వల్ల కలిగే బాధల్ని భరించలేని వాడికంటే ఉత్తముడు. మిత్రులతో కలిసి మెలసి వారి వల్ల కలిగే బాధల్ని భరించలేని వాడికంటే ఉత్తముడు. మిత్రులతో కలిసి మెలిసి ప్రేమతో జీవితం గడపాలి. నిస్వార్థమైన అనుబంధాలు ఏర్పరుచుకుని వాటిని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
స్నేహితులను అసహ్యించుకోవడం, ఈసడించుకోవడం, రుసరుసలాడే వైఖరిని వదులుకోవాలి. ఎల్లప్పుడు సత్ప్రవర్తన, మంచి నడవడిక గల వారిలో స్నేహం చేయాలి. స్నేహితుల ఎంపికలో ధర్మం రీత్యా, నీతిగా మీకు ఉపయోగపడేవారిని ఎన్నుకోవాలి. మనిషి తన స్నేహితుల ధర్మాన్ని (జీవన విధానాన్ని) అనుసరిస్తాడు. అందుచేత తాను స్నేహం చేస్తున్న వారిని గురించి ఆలోచించుకుని మరీ స్నేహం చేయాలి. విశ్వాసి సహచర్యంలో ఉండాలి. మీరు అన్న పానీయాలను దైవ భీతిపరుడితో కలిసి పుచ్చుకోండి. కలిసి మెలిసి భోజనం చేయడం ప్రేమానురాగాలకు మూలం.
కేవలం అల్లాహ్ కోసమే స్నేహితులను ప్రేమించాలి. దేవుని ప్రీతిపాత్రులైన దాసులు దైవ ప్రాతిపాదికపైనే ఒకరితో ఒకరు ఏకమవుతారు. భుజానికి భుజం, మనస్సుకు మనస్సు కలిపి దైవ ధర్మ సంస్థాపన, సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరి కలిసిమెలసి ముందుకెళుతూ ప్రేమానురాగాలతో కూడిన సమాజాన్ని నిర్మించినప్పుడే మానవ జన్మకు సార్థకత సాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు నడవాలని మతగురువు పేర్కొంటున్నారు.
ఇస్లాంలో సోదరభావానికి పెద్దపీట
‘ఇస్లాం’ అంటే శాంతి. శాంతికి మూలమైన సోదరభావం, సౌభ్రాతృత్వానికి ‘ఇస్లాం’ పెద్ద పీట వేస్తోంది. అందరం కలిసి మెలసి వెంటేనే సమాజంలో శాంతి సాధ్యమవుతుంది. రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో సోదరభావం వెల్లివిరుస్తుంది.
- ఖాదర్హుస్సేన్, మదనపల్లె
స్నేహానికి మతాలు అడ్డురావు
స్నేహానికి మతాలు అడ్డురావు. ఏ మతమైనా శాంతిని ప్రభోదిస్తుంది. ప్రేమానురాగాలు,బంధాలు, అనుబంధాలతోనే శాంతి సాధ్యం. రంజాన్ మాసం ముఖ్యంగా సమానత్వానికి,సోదరభావానికి,కలిసిమెలిసి జీవించడానికి పెద్దపీట వేస్తాయి.
- మునిగోటి శ్రీనివాసశర్మ,మదనపల్లె