రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధి పథకం కింద రెండవ విడతలో నగరసభల పరిధిలో రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం తెలిపారు. పట్టణాల అభివృద్ధి పథకం కింద 2 వ విడతలో రూ.15 కోట్లతో పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన కేంద్ర మంత్రి వీరప్పమొయిలీతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, మరో 19 జిల్లాల్లో టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నా రు. చేపట్టిన పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. నగర సభల అధ్యక్ష, ఉపాధ్యక్షుల రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు ఈనెల 30 లోపు ప్రమాణపత్రం అందజేస్తామన్నారు. వీరప్ప మొయిలీ మాట్లాడుతూ నగరసభల పరిధిలోని వార్డులలో నీటి శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటుకు చమురు కంపెనీల నుంచి రూ.2.5కోట్లు, నగర సభ పరిపాలన కట్టడాల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
ఘాటి పుణ్యక్షేత్రం సమీపంలోని విశ్వేశ్వరయ్య పికప్ డ్యాం పునరుద్ధరణకు ని ధులు విడుదల చేస్తామన్నారు. నవంబర్ 23న చిక్కబళ్లాపురంలో కెనరా బ్యాంక్ సహకారంతో రుణ మేళా, నిరుద్యోగ యువతీ యువకులకు విద్యాభ్యాసానికి రుణాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పట్టణంలో యూజీడీ పనుల కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మె ల్యే వెంకట రమణయ్య వీరప్ప మొయిలీని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.