ఖమ్మం బంద్ : డిపోలకే పరిమితమైన బస్సులు
సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు చేపట్టిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ కొనసాగుతోంది. అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభలు ఏర్పాటు చేశారు. డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా గేట్ల దగ్గర నిరసకారులు బైఠాయించారు. దీంతో జిల్లా బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఇంటివద్ద కూడా భద్రత ను కట్టుదిట్టం చేశారు.
►బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ కొత్తగూడెం జిల్లాలోని బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు అఖిలపక్ష నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలో వ్యాపార సంస్థలు మూసేయించారు.
►బంద్‌లో భాగంగా సత్తుల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు నిరసన తెలిపారు. బస్సులు బయటకు వెళ్లనీయకుండా ఇన్‌గేట్, అవుట్గేట్ వద్ద మహిళ కార్మికులు భైఠాయించారు. కాగా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాల నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
►భద్రాద్రి కొత్తగూడెంలోని మణుగూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కార్మికులకు మద్దతుగా పలు రాజకీయపార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
►డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వరంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులతో పాటు పలు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
►అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం చర్లలో బంద్ కొనసాగుతోంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
అర్థరాత్రి అంత్యక్రియలు
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు ఆదివారం అర్థరాత్రి నిర్వహించారు. డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఖమ్మం తరలించిన పోలీసులు.. రాత్రికిరాత్రే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆదివారం అర్థరాత్రే శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్రలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు మధ్య రాత్రి 9 గంట సమయంలో శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర బైపాస్ రోడ్డు ఎక్కగానే కాల్వోడ్డు హిందూ శ్మశాన వాటికకు తరలించేందుకు పోలీసలు ప్రయత్నించగా.. కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. ఆర్టీసీ డిపో మీదుగా పోనివ్వాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు యాత్ర బస్‌డిపో మీదుగా శ్మశానవాటిక వద్దకు సాగింది. రాత్రి 11 గంటల తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి.
నేడు సీపీఐ అత్యవసర సమావేశం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సోమవారం సీపీఐ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కీలక నేతలు సమావేశం కానునున్నారు. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సీపీఐ ఆదివారం వరకు గడువు ఇచ్చింది. గడువు ముగియడంతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నది.