Khammam Corporation Election campaign
-
వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరోజైన శుక్రవారం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని డివిజన్ల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను ప్రచార రథం ద్వారా ప్రజలకు పరిచయం చేశారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. బల్లేపల్లిలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బైక్ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, గట్టయ్య సెంటర్, రాపర్తినగర్, మయూరి సెంటర్, ముస్తఫానగర్, గాంధీచౌక్, మార్కెట్ గుండా ఎఫ్‌సీఐ గోడౌన్ వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో బైక్ లతోర్యాలీ నిర్వహించడంతో ఖమ్మం ప్రధాన రహదారులు వైఎస్సార్సీపీ జెండాలతో నిండిపోయాయి. ర్యాలీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, నేతలు ఎం.నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, భీమా శ్రీధర్, దారా యుగంధర్, నాగేంద్ర పాల్గొన్నారు. -
గాడిదకు గడ్డేస్తే.. ఆవు పాలివ్వదు: కేటీఆర్
ఖమ్మం: ‘గాడిదకు గడ్డేసి.. ఆవు దగ్గరకొచ్చి పాలు పిండితే ఎలా ఇస్తుంది.. ఓటు వేరే వారికి వేసి.. టీఆర్ఎస్ను అభివృద్ధి చేయమనడం న్యాయమా..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో గురువారం రోడ్‌షోలు నిర్వహించారు. పలుచోట్ల నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. 60 ఏళ్లుగా ఎర్ర, పచ్చ, మూడు రంగుల జెండాలకు అధికారం ఇచ్చారని, దీంతో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్కు ఐదేళ్లు అవకాశం ఇస్తే.. అబ్బురపడేలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖమ్మంలో వైవిధ్యమైన పరిస్థితి ఉందని, అభివృద్ధికి దూరంలో ఉన్న ఖమ్మంను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార సభలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.