
గాడిదకు గడ్డేస్తే.. ఆవు పాలివ్వదు: కేటీఆర్
ఖమ్మం: ‘గాడిదకు గడ్డేసి.. ఆవు దగ్గరకొచ్చి పాలు పిండితే ఎలా ఇస్తుంది.. ఓటు వేరే వారికి వేసి.. టీఆర్‌ఎస్‌ను అభివృద్ధి చేయమనడం న్యాయమా..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో గురువారం రోడ్‌షోలు నిర్వహించారు. పలుచోట్ల నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. 60 ఏళ్లుగా ఎర్ర, పచ్చ, మూడు రంగుల జెండాలకు అధికారం ఇచ్చారని, దీంతో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అన్నారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఐదేళ్లు అవకాశం ఇస్తే.. అబ్బురపడేలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖమ్మంలో వైవిధ్యమైన పరిస్థితి ఉందని, అభివృద్ధికి దూరంలో ఉన్న ఖమ్మంను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార సభలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.